ముంబై: అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా... ఈ ఆరుగురిలో నలుగురికి అవకాశం, మరో ఇద్దరు ఔట్! వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టును నేడు ఎంపిక చేయనున్న నేపథ్యంలో చర్చ జరగనున్న అంశం ఇదొక్కటే. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం సమావేశమవుతోంది. గత రెండేళ్లుగా వన్డేల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే 11 మంది సభ్యుల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. మిగిలిన అదనపు నాలుగు స్థానాల కోసం మాత్రం చాలా మంది తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లండ్ విమానమెక్కేదెవరో నేడు తేలనుంది. ముఖ్యంగా జట్టులో నాలుగో స్థానంలో ఆడే బ్యాట్స్‌మన్ విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో సెలక్టర్ల ఆలోచనలేమిటో తెలిసే సమయం ఆసన్నమైంది.
వీరు ఖాయం...
ఫామ్, ఇంగ్లండ్ పరిస్థితులు, జట్టు వ్యూహాలు, కెప్టెన్ కోహ్లి ఆలోచనలను బట్టి చూస్తే తొలి 11 మంది ఆటగాళ్లు మరో మాటకు తావు లేకుండా ఎంపికవుతారు. వీరిలో కెప్టెన్ కోహ్లితోపాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ ఖాయం. వీరిలో ఆరుగురు 2015 ప్రపంచకప్‌లో పాల్గొన్నారు.
రాయుడుకు అవకాశం ఉందా!
గత ఆరు నెలలుగా నాలుగో నంబర్ ఆటగాడిపైనే చాలా చర్చ జరిగింది. నిజానికి గత ఏడాది అక్టోబరులో ఆసియా కప్ తర్వాత కోహ్లి బహిరంగంగానే రాయుడు సరైనవాడంటూ మద్దతు పలికాడు. గతేడాది ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన తర్వాత రాయుడు టీమిండియాలోకి పునరాగమనం చేశాక భారత్ 24 వన్డేలు ఆడితే రాయుడు 21 ఆడాడు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో వన్డే సిరీస్ సమయంలో ఇంకా అనిశ్చితి ఉందంటూ కోహ్లి, రోహిత్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందేహాలు రేకెత్తించాయి. కివీస్‌తో చివరి వన్డేలో చక్కటి బ్యాటింగ్‌తో 90 పరుగులు చేసిన రాయుడు ఆసీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. ఆసియా కప్ నుంచి చూస్తే 42.18 సగటుతో రాయుడు చేసిన పరుగులు అద్భుతం కాకపోగా... అతడిని కొందరు మంచి బౌలర్లు ఇబ్బంది పెట్టిన తీరుతో కోహ్లి, రవిశాస్త్రి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అనిపించింది.
ఎవరి ఆట ఏమిటి?
రేసులో ఉన్న కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ ఆటను పట్టించుకోమని సెలక్టర్లు చెబుతున్నా... పూర్తిగా విస్మరించలేరు కూడా. రాహుల్ మిడిలార్డర్‌లో ఆడటంతో పాటు పైగా మూడో ఓపెనర్‌గా పని కొస్తాడు. మరోవైపు దినేశ్ కార్తీక్ తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనూ అద్భుతం అనిపించేలా, తనపై నమ్మకం పెంచేలా ఒక్కసారి కూడా ఆడలేదు. ఇక రిషభ్ పంత్ కాస్త ముందంజలో ఉన్నాడు. ఏ క్షణానైనా ఆటను మార్చేయగల దూకుడుకు తోడు ఎడంచేతి వాటం కావడం అతని అదనపు బలం. ధోని ఉండటంతో కీపర్ స్థానంలో పరిగణించకుండా బ్యాట్స్‌మన్‌గా సెలక్టర్లు అతడిని చూస్తున్నారు.
జడేజాకు చాన్స్!
ఆల్‌రౌండర్ స్థానానికి జడేజా, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంది. శంకర్ పట్ల కొంత సానుకూలతలు ఉన్నా 9 వన్డేలే ఆడిన అతనిపై నమ్మకం ఉంచడం కష్టం. పైగా అతని స్లో మీడియం పేస్ బౌలింగ్ మధ్య ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరోవైపు జడేజా మాత్రం కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేయగల సమర్థుడు. దాని వల్ల వారిపై ఒత్తిడి పెరిగి వికెట్లు దక్కడం చాలా సార్లు జరిగింది. పైగా జట్టులో అత్యుత్తమ ఫీల్డర్. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో చక్కగా రాణించడం జడేజాకు కలిసొచ్చే అంశం. ఇక కోహ్లి ఆలోచనల ప్రకారం నాలుగో రెగ్యులర్ పేసర్ అవసరం పెద్దగా లేదు కాబట్టి దాని గురించి చర్చ జరగడం సందేహమే. దీనిపై సెలక్టర్లు ఆలోచిస్తే మంచి వేగం ఉన్న నవదీప్ సైనీ పేరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల ప్రకటనకు ఏప్రిల్ 23 ఆఖరి తేదీ కాగా... అవసరమైతే మార్పులు చేసేందుకు మే 23 వరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనుమతినిచ్చింది.
వరల్డ్ కప్‌కు వెళ్లేదెవరు?
Published Mon, Apr 15 2019 4:23 AM | Last Updated on Mon, Apr 15 2019 5:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment