ఒకవైపు 320 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకుపోతున్నాయి... మరోవైపు అంతే రేంజ్‌లో ఫ్యాన్స్ ఉత్సాహం, ఉత్కంఠ... ఒకవైపు వీఐపీ బాక్స్‌లో నుంచి సెలబ్రిటీలు రేస్‌ను ఆస్వాదిస్తుండగా... మరోవైపు గ్యాలరీల్లో ఉన్న సాధారణ అభిమానుల హోరుతో పరిసరాలు దద్దరిల్లుతున్నాయి... రెప్పపాటులో ట్రాక్‌పై జూమ్మంటూ జనరేషన్ ‘3’ కార్లు పరుగులు తీయగా... దాదాపు గంట పాటు హుస్సేన్ సాగర్ తీరం ప్రపంచ పటంపై కనువిందు చేసింది.
న్యూయార్క్, బెర్లిన్, బీజింగ్, రోమ్, జ్యూరిక్... ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఫార్ములా ‘ఇ’ రేస్‌కు ఆతిథ్యం ఇస్తున్న నగరాల్లో కొన్ని. ఇప్పుడు హైదరాబాద్ కూడా వీటి సరసన చేరింది. కొత్తగా వచ్చిన క్రీడతో ‘స్ట్రీట్ సర్క్యూట్’ వద్ద అన్ని రకాలుగా కొత్త తరహా వాతావరణం కనిపించింది. ఫార్ములా ‘ఇ’ రేస్ విజయవంతమైందన్న సంకేతాన్ని చాటింది. ఈ హోరాహోరీ సమరంలో చివరకు డీఎస్ పెన్‌స్కే జట్టు డ్రైవర్ జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు.
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ ఫార్ములా ‘ఇ’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అటు ప్రేక్షకాదరణతో పాటు ఇటు నిర్వాహకుల వైపు నుంచి కూడా సూపర్ సక్సెస్‌గా ప్రశంసలందుకుంది. ఫార్ములా ‘ఇ’ 9వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లో శనివారం నాలుగో రేస్ ముగిసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో రూపొందించిన ‘స్ట్రీట్ సర్క్యూట్’పై 22 మంది పోటీ పడిన ఈ రేస్‌లో డీఎస్ పెన్‌స్కే టీమ్‌కు చెందిన జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు.
33 ల్యాప్‌లతో 2.83 కిలోమీటర్లు ఉన్న ట్రాక్‌పై సాగిన ఈ రేస్‌ను వెర్నే అందరికంటే వేగంగా 46 నిమిషాల 01.099 సెకన్లలో పూర్తి చేశాడు. ఎన్‌విజన్ రేసింగ్ డ్రైవర్ నిక్ కాసిడీ రెండో స్థానంలో, పోర్‡్ష టీమ్ డ్రైవర్ ఫెలిక్స్ డి కోస్టా మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన మహీంద్రా టీమ్ డ్రైవర్ ఒలివర్ రోలండ్‌కు ఆరో స్థానం దక్కింది. 29 పాయింట్లతో పెన్‌స్కే ‘టీమ్ చాంపియన్’గా నిలిచింది. విజేతగా నిలిచిన జీన్ ఎరిక్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు... రన్నరప్ నిక్ క్యాసిడీకి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్‌లో భాగంగా ఐదో రేస్ ఈనెల 25న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతుంది.
హైదరాబాద్ రేస్ విశేషాలు...
► వెర్నే రేస్ పూర్తి చేసే సమయానికి అతని కారులో 0.5 శాతం ఎనర్జీ మాత్రమే మిగిలి ఉంది.
► ఎన్‌విజన్ డ్రైవర్ సెబాస్టియన్ బ్యూమీ మూడో స్థానంలో నిలిచినా... ‘ఓవర్ పవర్’ ఉపయోగించినందుకు 17 సెకన్ల పెనాల్టీ విధించడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు.
► మహీంద్రా టీమ్ డ్రైవర్లలో రోలండ్ ఆరో స్థానంలో, డి గ్రాసి 14వ స్థానంలో నిలిచారు.
► జాగ్వార్ టీమ్‌కు చెందిన ఇద్దరు డ్రైవర్లు మిచ్ ఇవాన్స్, స్యామ్ బర్డ్ ఒకరినొకరు ట్రాక్‌పై ‘ఢీ’ కొట్టుకున్నారు. దాంతో ఇద్దరూ రేస్‌ను పూర్తి చేయలేకపోయారు.
► మూడో స్థానంలో నిలిచిన మాజీ విజేత డి కోస్టాకు ఇది 100వ రేస్ కావడం విశేషం.
► పెన్‌స్కే టీమ్‌కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ స్టాఫెల్ వండూర్న్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
► 23వ ల్యాప్‌లో మెక్‌లారెన్ డ్రైవర్ జేక్ హ్యూజెస్ కారు స్టీరింగ్ జామ్ అయి ఆగిపోవడంతో సేఫ్టీ కారును తీసుకోవాల్సి వచ్చింది. చివరకు అతనూ రేస్ పూర్తి చేయలేకపోయాడు. ఓవరాల్‌గా ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేకపోయారు.
హైదరాబాద్ ‘ఇ’ రేసు ఫలితాలు (టాప్–10): 1. జీన్ ఎరిక్ వెర్నే (డీఎస్ పెన్‌స్కే; 46ని:01.099 సెకన్లు), 2. నిక్ క్యాసిడీ (ఎన్‌విజన్; 46ని:01.499 సెకన్లు), 3. ఫెలిక్స్ డి కోస్టా (పోర్‡్ష; 46ని: 02.958 సెకన్లు), 4. వెర్లీన్ (పోర్‡్ష; 46ని: 03.954 సెకన్లు), 5. సెటె కెమారా (నియో 333 రేసింగ్; 46ని: 04.622 సెకన్లు), 6. రోలండ్ (మహీంద్రా; 46ని: 08.237 సెకన్లు), 7. నార్మన్ నాటో (నిస్సాన్; 46ని: 08.417 సెకన్లు), 8. స్టాఫెల్ వాన్‌డూర్న్ (డీఎస్ పెన్‌స్కే; 46ని: 08.663 సెకన్లు), 9. లాటరర్ (అవలాంచె; 46ని: 9.802 సెకన్లు), 10. మొర్టారా (మసెరాటి; 46ని: 10.172 సెకన్లు).
Comments
Please login to add a commentAdd a comment