న్యూఢిల్లీ: తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓటమిపాలయ్యాక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్లు అయిష్టత ప్రదర్శిస్తున్నారు. తమ అత్యుత్తమ డబ్ల్యూటీసీ జట్టులో కనీసం చోటు కూడా కల్పించకుండా టీమిండియా రన్ మెషీన్‌ను అవమానిస్తున్నారు. తొలుత టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన డ్రీమ్ జట్టులో కోహ్లీకి స్థానాన్ని నిరాకరించగా, తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు, దిగ్గజ చైనామెన్ బౌలర్ బ్రాడ్ హాగ్ తన అత్యుత్తమ జట్టులో కోహ్లీకి స్థానం కల్పించలేనని కరాఖండిగా చెప్పేశాడు. తన జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు అవకాశం కల్పించిన ఆయన.. ఆశ్చర్యకరంగా కోహ్లీని పక్కనపెట్టేసాడు.
అంతేకాకుండా డబ్ల్యూటీసీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీ చేసిన తమ దేశ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కాదని శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నేను తీసుకున్నాడు. అతని ఓపెనింగ్ పార్ట్‌నర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశాడు. ఫస్ట్ డౌన్‌లో కేన్ విలియమ్సన్‌కు అవకాశం కల్పించిన హగ్.. అతన్నే తన జట్టు కెప్టెన్‌గా ఎన్నుకున్నాడు. టెస్ట్‌ల్లో కోహ్లీ స్థానమైన నాలుగో స్థానాన్నిఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో భర్తీ చేశాడు. ఇక ఐదో స్థానం కోసం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఎంపిక చేసిన ఆయన.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఆరో స్థానాన్ని కేటాయించాడు.
వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కోటాలో రిషబ్ పంత్‌ను ఎంచుకున్న హాగ్.. ఏడో స్థానం కోసం అతనే పర్ఫెక్ట్ ఆటగాడని కితాబునిచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై కూడా పంత్ అదరగొట్టాడని, ఫైనల్లోనూ కీలక సమయంలో 40 పరుగులతో రాణించాడని హాగ్ గుర్తు చేశాడు. ఏకైక స్పిన్నర్‌గా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్న ఆయన.. డబ్ల్యూటీసీ టోర్నీలో అతనే అత్యధిక వికెట్లు సాధించాడన్న విషయాన్ని ప్రస్తావించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కైల్ జెమీసన్‌ను తన ప్రధాన పేసర్‌గా, ఇంగ్లండ్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్, టీమిండియా పేస్ సుల్తాన్ మహమ్మద్ షమీలను అతని సహచర పేసర్లుగా ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరంగా కగిసో రబడా, టీమ్ సౌథీ, ప్యాట్ కమిన్స్‌లను పక్కనపెట్టేసాడు.
హాగ్ డ్రీమ్ డబ్ల్యూటీసీ జట్టు:
రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బాబర్ ఆజామ్, బెన్ స్టోక్స్, రిషబ్ పంత్, కైల్ జేమీసన్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, మహమ్మద్ షమీ
Comments
Please login to add a commentAdd a comment