2024 ఏడాదిని విజయంతో టీమిండియా ఆరంభించింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌కు వేదికైన కేప్‌టౌన్ పిచ్‌పై ప్రస్తుతం క్రికెట్ వర్గాలపై తెగ చర్చనడుస్తోంది. ఈ పిచ్‌పై పేసర్లు అద్బుతాలు సృష్టించారు. ఒకటిన్నర రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలాయి.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్ టెస్టు రికార్డులకెక్కింది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. భారత్ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి రోహిత్ గట్టి కౌంటరిచ్చాడు.
"ఇది కూడా క్రికెట్ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్ ఇస్తారు? భారత్‌లో ప్రపంచకప్ ఫైనల్ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్’ రేటింగ్ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి.
కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్‌కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్ తిరిగితే ఇవేం పిచ్‌లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: Ind vs SA: దెబ్బకు దెబ్బ: రెండు రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment