పుజారా గోడ.. ద్రవిడ్‌ కంటే బలమైనదట! | Funny Trolls On Cheteshwar Pujara Batting Style In Adelaide Pink Test | Sakshi
Sakshi News home page

పుజారా గోడ.. ద్రవిడ్‌ కంటే బలమైనదట!

Published Thu, Dec 17 2020 1:47 PM | Last Updated on Thu, Dec 17 2020 3:58 PM

Funny Trolls On Cheteshwar Pujara Batting Style In Adelaide Pink Test - Sakshi

అడిలైడ్‌ : టెస్టు మ్యాచ్‌ అంటేనే ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌ తమ ఇన్నింగ్స్‌ను నత్తనడకన సాగిస్తూ బౌలర్లకు చిరాకు తెప్పిస్తుంటారు. కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్లు ఆడే జిడ్డు ఇన్నింగ్స్‌లే జట్టును ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టీమిండియా క్రికెట్‌లో లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ తర్వాత జిడ్డు క్రికెట్‌కు పర్యాయపదంగా మారిపోయిన వ్యక్తి మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌. ద్రవిడ్‌ తన 16 ఏళ్ల కెరీర్‌లో టెస్టు క్రికెట్‌లో డిఫెన్స్‌ అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పాడు. అతని కాలంలో టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో ఎన్నో జిడ్డు ఇన్నింగ్స్‌లు ఆడి చాలాసార్లు ఓటమి నుంచి తప్పించాడు. అందుకే 'ది వాల్‌' అనే పేరును ద్రవిడ్‌ తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ద్రవిడ్‌ తరహాలోనే టీమిండియాకు టెస్టుల్లో మరో వాల్‌గా తయారయ్యాడు... చటేశ్వర్‌ పుజారా.. టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన పుజారా అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు.(చదవండి : పృథ్వీ షా డకౌట్‌.. వైరలవుతున్న ట్వీట్స్‌)

తాజాగా అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ నత్తనడకన సాగుతుంది. టెస్ట్‌ స్పెషలిస్ట్‌గా ముద్రపడిన చతేశ్వర్‌ పుజారా ఇన్నింగ్స్‌ చూస్తే ఎవరికైనా మతి పోతుంది. టెస్టు క్రికెట్‌ అంటే ఎలా ఉంటుందో ఆసీస్‌ ఆటగాళ్లకు చూపిస్తున్నాడు. స్కోరుబోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదవ్వకుండానే ఓపెనర్‌ పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు.


టీమిండియా స్కోరు సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పుజారా ఎంతో ఓపికగా ఆడుతూ 145 బంతుల ఎదుర్కొని ఒక్క బౌండరీ కూడా లేకుండా 30 పరుగులు చేశాడు. బహుశా తన కెరీర్లో అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్‌ ఇదే కావడం విశేషం. వాస్తవానికి అది పుజారా తప్పు కాదు.. పిచ్‌ పరిస్థితి బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో నత్తనడకన ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. అయితే పుజారా ఆటతీరుపై సోషల్‌ మీడియాలో ఫన్నీ ట్రోల్స్‌ వస్తున్నాయి. అసలైన టెస్టు క్రికెటర్‌ అంటే పుజారా.. మా పుజారా సిమెంట్‌ అంబుజా సిమెంట్‌ కంటే దృడంగా ఉంటుంది.. పుజారా కట్టే గోడ ద్రవిడ్‌ గోడ కన్నా బలంగా ఉంటుంది.. ద్రవిడ్‌ తర్వాత మాకు మరో వాల్‌ దొరికాడు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : వైరల్‌ : ఒకరినొకరు తోసుకున్న ఆటగాళ్లు)

ఇక తొలి టెస్టులో టీమిండియా తన ఇన్నింగ్స్‌ను నత్తనడకన కొనసాగిస్తుంది. మొదటిరోజు రెండో సెషన్‌లో భాగంగా టీమిండియా 46 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. పుజారా 31, కోహ్లి 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ పృథ్వీ షా తొలి ఓవర్‌ రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరగ్గా.. 17 పరుగులు చేసిన మయాంక్‌ అగర్వాల్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లి,పుజారాలు కలిసి మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతూ లంచ్‌ విరామానికి వెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement