
టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం లభించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 నేపథ్యంలో రెండు నెలలకు పైగా భారత జట్టు ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22న మొదలై మే 25న ఫైనల్‌తో ముగియనుంది.
ఈ పొట్టి ఫార్మాట్ టోర్నమెంట్ పూర్తైన తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటన(India Tour Of England)కు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమయ్యే అవకాశం ఉంది.
గంభీర్ కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా సిరీస్ కంటే ముందే ఇంగ్లండ్‌కు వెళ్లనున్న ఇండియా-‘ఎ’ జట్టుతో అతడు ప్రయాణించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిననాటి నుంచి గంభీర్‌తో బీసీసీఐతో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నాడు. ఇండియా-‘ఎ’ జట్టుతో పాటు ప్రయాణం చేయాలని అతడు భావిస్తున్నాడు.
అందుకే ఇలా
రిజర్వ్ ఆటగాళ్ల నైపుణ్యాలను దగ్గరగా పరిశీలించాలని అతడు భావిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత.. గంభీర్ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నాడు.
ఈ మెగా టోర్నీలో వైల్డ్ కార్డ్ ద్వారా అతడు తీసుకువచ్చిన ఆటగాళ్ల నుంచి మెరుగైన ఫలితాలు వచ్చాయి. టెస్టుల్లోనూ ఇదే తరహా సూత్రాన్ని పాటించాలని భావిస్తున్నాడు.
ముఖ్యంగా ఇండియా-‘ఎ’ జట్టులోని ప్రతిభావంతులకు అవకాశం ఇస్తే బాగుంటుందని అతడు భావిస్తున్నాడు. ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీని వీడిన తర్వాత ఇండియా-‘ఎ’ టూర్లు నామమాత్రంగా మారిపోయాయి.
టెస్టుల్లో ఘోర పరాభవాలు
అందుకే గంభీర్ ఈ అంశంపై దృష్టి సారించాడు. టూర్ల సంఖ్య పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత విజయాలు అందుకున్న గంభీర్.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు చవిచూశాడు.
టీ20, వన్డే ద్వైపాక్షిక టోర్నీల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్ క్లీన్‌స్వీప్ విజయాలు సాధించి సత్తా చాటింది. అయితే, సొంతగడ్డపై టెస్టుల్లో కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.
అదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో 3-1తో కంగారూల చేతిలో ఓడి దశాబ్దకాలం తర్వాత ఓటమిని చవిచూసింది. దీంతో గంభీర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అతడిని తొలగించాలనే డిమాండ్లూ వినిపించాయి.
ఇలాంటి తరుణంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడం ద్వారా గంభీర్ తిరిగి గాడిలో పడ్డాడు. కాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తాను మెంటార్‌గా పనిచేసిన సమయంలో గుర్తించిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలను ఈ మెగా వన్డే టోర్నీలో ఆడించడం ద్వారా మరోసారి విమర్శల పాలయ్యాడు గంభీర్.
ఇండియా-‘ఎ’ టీమ్‌పై కూడా దృష్టి.. వారి గుండెల్లో గుబులు
అయితే, వారిద్దరు జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించడంతో గంభీర్‌ను విమర్శించిన వాళ్లే అతడి నిర్ణయాన్ని సమర్థించడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లోనూ తన ముద్ర వేసేందుకు గంభీర్ ఇండియా-‘ఎ’ టీమ్‌పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఫామ్‌లేమితో సతమతమయ్యే సీనియర్లపై వేటు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ఇంతకు ముందు కోచ్‌లుగా పనిచేసిన ద్రవిడ్, రవిశాస్త్రి వంటి వారు ఎప్పుడూ ఇలా ఇండియా-‘ఎ’ జట్టుతో ప్రయాణించిన దాఖలాలు లేవని.. ఈ ప్రయోగం ద్వారా గంభీర్ ఎలాంటి ఫలితం పొందుతాడో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.
చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment