బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తొమ్మిదేళ్ల ఆధిపత్యానికి తెర పడింది. బీజీటీ 2024-25ని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (జనవరి 5) ముగిసిన చివరి టెస్ట్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి టెస్ట్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యింది. భారత్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది.
డబ్ల్యూటీసీ ఓటమి నేపథ్యంలో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడపై కత్తి వేలాడుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌ను తక్షణమే తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్ ఓ చెత్త కోచ్ అని భారత క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గంభీర్ వచ్చి టీమిండియాను నాశనం చేశాడని వారంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన గంభీర్.. చెత్త వ్యూహాలతో టీమిండియాను భ్రష్ఠుపట్టించాడని అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలకు గంభీరే పరోక్ష కారణమని మండిపడుతున్నారు.
కాగా, గంభీర్ రాక ముందు టీమిండియా ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండింది. రాహుల్ ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ 2024 టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. ఆ వెంటనే గంభీర్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. గంభీర్ హెడ్ కోచ్‌గా టీమిండియా తొలి సిరీస్‌లో గెలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడి నుంచి గంభీర్ వైఫల్యాలకు బీజం పడింది. గంభీర్ ఆథ్వర్యంలో భారత్ రెండో సిరీస్‌నే కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది.
ఆతర్వాత భారత్ బంగ్లాదేశ్‌పై టెస్ట్, టీ20 సిరీస్‌ల్లో విజయాలు సాధించింది. అనంతరం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఇంత చిత్తుగా ఓడటం భారత్‌కు ఇదే మొదటిసారి. కివీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మరిచిపోయేలోపే భారత్ బీజీటీలో బొక్కబోర్లా పడింది. బీజీటీలో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది.
ఇదిలా ఉంటే, సిడ్నీ టెస్ట్‌లో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు.
నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment