మకావ్: వరుసగా ఐదు టోర్నమెంట్‌లలో క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఆ అడ్డంకిని ఆరో ప్రయత్నంలో అధిగమించింది. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో మూడో సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–12, 21–17తో ఆరో సీడ్ సు యిన్ హుయ్–లోన్ జి యున్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది.
గత జూన్‌లో సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీఫైనల్ చేరిన తర్వాత గాయత్రి–ట్రెసా ఐదు టోర్నీలు ఆడారు. అయితే ఈ ఐదు టోర్నీల్లో వారు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 12–21తో ఓడిపోయాడు.
నేడు జరిగే మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సెయి పె షాన్–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. గతవారం చైనా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్‌లోనే సెయి పె షాన్–హుంగ్ ఎన్ జు చేతిలో ఓడిన గాయత్రి–ట్రెసా ఈసారి గెలిచి బదులు తీర్చుకుంటారో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment