ఫిలిప్స్‌ మెరుపు సెంచరీ.. పాక్‌ను చిత్తుచేసిన న్యూజిలాండ్‌ | Glenn Phillips AllRound Show helps New Zealand crush Pakistan in Tri series opener | Sakshi
Sakshi News home page

PAK vs NZ: ఫిలిప్స్‌ మెరుపు సెంచరీ.. పాక్‌ను చిత్తుచేసిన న్యూజిలాండ్‌

Published Sun, Feb 9 2025 7:30 AM | Last Updated on Sun, Feb 9 2025 10:07 AM

Glenn Phillips AllRound Show helps New Zealand crush Pakistan in Tri series opener

స్వదేశంలో చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆడుతున్న ముక్కోణపు వన్డే టోర్నీని పాకిస్తాన్‌ పరాజయంతో ప్రారంభించింది. మూడు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీ తొలి పోరులో శనివారం పాకిస్తాన్‌ 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.

ఫిలిప్స్‌ ఊచకోత..
న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(Glenn Phillips) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఫిలిప్స్.. పాక్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదినైతే ఫిలిప్స్ ఓ ఆట ఆడేసికున్నాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో ఈ కీవీ స్టార్.. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్ల సాయం(Wd Wd 4 6 6 2 4 1) సాయంతో ఏకంగా 29 ప‌రుగులు పిండుకున్నాడు.

ఓవ‌రాల్‌గా 74 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్‌.. 6 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 106 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫిలిప్స్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు నియర్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (89 బంతుల్లో 58; 7 ఫోర్లు), డారిల్‌ మిచిల్‌ (84 బంతుల్లో 81; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు.

విల్‌ యంగ్‌ (4), వికెట్‌ కీపర్‌ టామ్‌ లాథమ్‌ (0) విఫలం కాగా... రచిన్‌ రవీంద్ర (25), బ్రాస్‌వెల్‌ (31) ఫర్వాలేదనిపించారు. పాకిస్తాన్‌ బౌలర్లలో షాహీన్‌ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా... అబ్రార్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 

ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (69 బంతుల్లో 84; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... సల్మాన్‌ ఆఘా (40), తయ్యబ్‌ తాహిర్‌ (30) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (3), మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (10), కమ్రాన్‌ గులామ్‌ (18) విఫలమయ్యారు.

కివీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ సాంట్నర్, మ్యాట్‌ హెన్రీ చెరో 3 వికెట్లు పడగొట్టారు.  ఫిలిప్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా సోమవారం జరగనున్న తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్‌ తలపడనుంది.
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్‌ ప్రధాని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement