భారత్‌ బంగారు గురి | Gold for Isha Singhs team in World Shooting Championship | Sakshi
Sakshi News home page

భారత్‌ బంగారు గురి

Published Mon, Aug 21 2023 2:16 AM | Last Updated on Mon, Aug 21 2023 7:50 PM

Gold for Isha Singhs team in World Shooting Championship  - Sakshi

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచ సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత షూటర్లు అద్వితీయ ప్రదర్శనతో అలరించారు. రెండు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకం సాధించడంతోపాటు భారత్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ ఐదో బెర్త్‌ను ఖరారు చేశారు. తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్, హరియాణా అమ్మాయిలు రిథమ్‌ సాంగ్వాన్, మనూ భాకర్‌ బృందం మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం అందించింది. రిథమ్, ఇషా సింగ్, మనూ భాకర్‌ జట్టు 1,744 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

వ్యక్తిగత విభాగంలో రిథమ్‌ 583 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇషా సింగ్‌ 581 పాయింట్లతో 16వ స్థానంలో, మనూ 580 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రిథమ్‌ ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో అఖిల్‌ షెరాన్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్, నీరజ్‌ కుమార్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం గెలిచింది.

భారత బృందం మొత్తం 1750 పాయింట్లు స్కోరు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌లో 585 పాయింట్లు స్కోరు చేసిన అఖిల్‌ ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఎనిమిది మంది మధ్య షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అఖిల్‌ 450 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా భారత్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ ఐదో బెర్త్‌ను అందించాడు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్‌ మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది.  

అనాహత్‌ అదరహో 
డాలియన్‌ (చైనా): భారత స్క్వాష్‌ రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్‌ ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అండర్‌–17 బాలికల సింగిల్స్‌ విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించింది. 15 ఏళ్ల అనాహత్‌ ఫైనల్లో 3–1తో ఇనా క్వాంగ్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించింది. ఈ టోరీ్నలో భారత్‌కు మూడు కాంస్య పతకాలు కూడా లభించాయి. అండర్‌–19 బాలుర సింగిల్స్‌లో శౌర్య, అండర్‌–19 బాలికల సింగిల్స్‌లో పూజ ఆర్తి, అండర్‌–15 బాలుర సింగిల్స్‌లో ఆర్యవీర్‌ సింగ్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు.    

చాంపియన్‌ వృత్తి అగర్వాల్‌
భువనేశ్వర్‌: జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు 14 పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ టోరీ్నలో తెలంగాణ స్విమ్మర్లు ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచారు. హైదరాబాద్‌ అమ్మాయి వృత్తి అగర్వాల్‌ గ్రూప్‌–1 బాలికల విభాగంలో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించింది.

వృత్తి ఈ టోర్నీలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. చివరిరోజు శివాని కర్రా 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్స్‌లో తెలంగాణకు రెండు రజత పతకాలు అందించింది. గచి్చ»ౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ కోచ్‌ ఆయుశ్‌ యాదవ్‌ వద్ద శివాని శిక్షణ తీసుకుంటోంది. నిత్యశ్రీ సాగి రెండు రజతాలు, ఒక కాంస్యం, సుహాస్‌ ప్రీతమ్‌ రెండు కాంస్యాలు నెగ్గారు.  
    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement