సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాదీ బిర్యానీకి ఫిదా అయ్యాడు. కమ్మని బిర్యానీ రుచితో కడుపు నిండిపోయిందని.. మరో వారం రోజుల పాటు తాము ఇంకేమీ తినాల్సిన పనిలేదంటూ చమత్కరించాడు.
తన కుటుంబం తొలిసారి భారత్‌కు వచ్చిందని.. వారితో కలిసి హైదరాబాద్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. తమకు రుచికరమైన భోజనం అందించిన హోటల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.
కుటుంబంతో కలిసి అక్కడ దిగిన ఫొటోలను కమిన్స్ ఇన్‌స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ తమ సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, టీ20లలో నాయకుడిగా పెద్దగా అనుభవం లేని ఈ వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌ను ఎంపిక చేసి రైజర్స్ రిస్క్ తీసుకుందని చాలా మంది భావించారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపిస్తున్నాడు కమిన్స్.
ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఎనిమిదింట ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏకంగా మూడుసార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేసి రికార్డులు సృష్టించింది. కెప్టెన్‌గా భేష్ అనిపిస్తున్న ఈ పేస్ బౌలర్.. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టాడు.
కాగా గురువారం నాటి ఉప్పల్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయింది. తదుపరి ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా కమిన్స్ బృందం తలపడనుంది.
చదవండి: రోహిత్, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే: యువీ
Comments
Please login to add a commentAdd a comment