సాక్షి, హైదరాబాద్: 161 బంతుల్లో 23 పరుగులు... ఈ స్కోరు చూస్తే ఇంతేనా అనిపిస్తుంది! కానీ ఇదే ఇన్నింగ్స్ విలువ మాటల్లో చెప్పలేనంత అమూల్యం! గాయంతో బాధపడుతూనే ఒక్కో బంతిని ఎదుర్కొంటూ భారత్‌ను ఓటమి నుంచి రక్షించిన ఈ ప్రదర్శన హనుమ విహారిని ఒక్కసారిగా హీరోను చేసింది. అప్పటి వరకు ఆడిన 11 టెస్టుల ప్రదర్శనతో పోలిస్తే సిడ్నీలో పోరాటం విహారి స్థాయిని పెంచింది. అశ్విన్‌తో కలిసి విహారి ఆడిన ఆటతో మూడో టెస్టును కాపాడుకున్న భారత్ చివరి టెస్టులో విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండో పర్యటనలోనూ గెలుపు బృం దంలో భాగంగా ఉన్న విహారి తాజా సిరీస్ విజయం పట్ల అమితానందంగా కనిపించాడు. ప్రస్తుతం అతను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహాబిలిటేషన్‌తో గాయం నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన కెరీర్‌లో సిడ్నీ ప్రదర్శన ఎప్పటికీ మరచిపోలేని ఘట్టంగా నిలిచిపోతుం దన్న విహారి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే...
బ్రిస్బేన్‌లో గెలుపు, సిరీస్ సొంతం కావడంపై...
చాలా చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల క్రితం మేం ఉన్న స్థితి నుంచి సిరీస్ గెలుపు వరకు చూస్తే అంతా అద్భుతంలా కనిపించింది. చరిత్రలో అతి గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో నేనూ ఉండటం చాలా గర్వంగా అనిపిస్తోంది. ముఖ్యంగా చివరి టెస్టులో మా వాళ్లంతా చాలా బాగా ఆడారు. వారిని అక్కడ చూస్తుంటే నేనూ ఉంటే బాగుండేదనిపించింది. విజయపు వేడుకల్లో భాగం కాలేకపోవడం సహజంగానే నిరాశ కలిగించింది. అశ్విన్‌లాగా కాకుండా నేను తర్వాతి మ్యాచ్ ఆడలేనని సిడ్నీలోనే తేలిపోయింది. ఎన్‌సీఏకి వెళ్లి గాయం నుంచి కోలుకునేం దుకు సాధ్యమైనంత త్వరగా రీహాబిలిటేషన్ ప్రారంభించా లని చెప్పడంతో సిడ్నీ నుంచి రావాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ఎంపిక కాలేదు కానీ మూడో టెస్టులోగా కోలుకొని జట్టులోకి వస్తానని నమ్మకముంది. చదవండి: (ఆసీస్ అడ్డాలో టీమిండియా కొత్త చరిత్ర)
రెండేళ్ల క్రితం గెలుపుతో పోలిస్తే...
ఆసీస్ గడ్డపై అప్పటి వరకు భారత్ ఒక్కసారీ సిరీస్ నెగ్గలేదు. కాబట్టి నాడు అది చాలా ప్రత్యేకంగా అనిపించింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తాజా విజయం మరింత మధురంగా అనిపిస్తోంది. నా వరకు చూస్తే రెండు సిరీస్ లలోనూ నేను జట్టులో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నా ఆనందం రెట్టింపైంది. దీనిని మాటల్లో చెప్పలేను. ఇంత కంటే ఇంకేం ఆశించగలను! నిజానికి క్వారంటైన్, బయో బబుల్ చాలా కఠినంగా అనిపించాయి. అయితే ఇంత ప్రతిష్టాత్మక సిరీస్ ఆడుతున్న సమయంలో ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని మేమందరం గట్టిగా అనుకున్నాం కాబట్టి అది ఇబ్బంది కాలేదు. ఈ రెండు పర్యటనల మధ్య బ్యాట్స్‌మన్‌గా కూడా నేను ఎంతో మెరుగయ్యాను.
వైఫల్యాల తర్వాత జట్టులో స్థానంపై...
సహజంగానే కొంత అనిశ్చితి ఉంటుంది. అడిలైడ్, మెల్‌బోర్న్‌లలో నేను తక్కువ స్కోర్లు చేయడం వాస్తవమే అయినా ఎక్కడా తడబడలేదు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మంచి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాను. అయితే అవి భారీ స్కోర్లుగా మారలేదు. అయినా తుది జట్టు ఎంపిక గురించి ఊహించలేం. అవకాశం రాకపోతే ఏమీ చేయలేం. అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం వంద శాతం కష్టపడి బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇక నేను ఒకటి మినహా (వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై) మిగిలిన 11 టెస్టులు విదేశాల్లోనే ఆడాను. టీమ్ మేనేజ్‌మెంట్ నన్ను బయటి టెస్టుల్లోనే పరిగణనలోకి తీసుకుంటోందా అనేది కూడా చెప్పలేను. అయితే అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం.
సిడ్నీ అద్భుతం గురించి...
ఆ రోజు గురించి నేను ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా భావోద్వేగానికి లోనవుతా! నేను బ్యాటింగ్ మొదలు పెట్టిన కొద్ది సేపటికే (27 బంతులకు) కండరాలు పట్టేశాయి. ఇక పరుగు తీయడం కష్టమని అర్థమైపోయింది. తర్వాతి ఓవర్లోనే పుజారా వెనుదిరిగాడు. అంతే... ఇక మ్యాచ్‌ను కాపాడుకోవాలని నేను, అశ్విన్ నిర్ణయించుకున్నాం. వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా నిలబడ్డాం. ఆస్ట్రేలియా అత్యుత్తమ బౌలింగ్ దళాన్ని ఎదుర్కోవడం సులువు కాదు. ఆ సమయంలో అది మరీ కష్టంగా అనిపించింది. నొప్పి పెరిగిపోవడంతో నివారణ ఇంజక్షన్ తీసుకున్నాను.
బలవంతంగా ఆటలో కొనసాగితే గాయం తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే విషయం గురించి ఆలోచించలేదు. రెండు టెస్టుల్లో విఫలమైన తర్వాత కూడా నన్ను నమ్మి మేనేజ్‌మెంట్ నాకు అవకాశం ఇచ్చింది. దానిని నిలబెట్టుకునేందుకు ఏం జరిగినా ఆడాలనుకున్నా. ఇద్దరం ఒకే తరహా స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రోత్సహించుకుంటూ కదిలాం. అశ్విన్‌కు కొంత తెలుగు పరిజ్ఞానం ఉండగా... చెన్నైలో ఆడిన అనుభవంతో నాకు తమిళం వచ్చు. అవే భాషల్లో మా సంభాషణ సాగింది. ఆట ముగిశాక నాకు కలిగిన సంతృప్తిని మాటల్లో చెప్పలేను.
సిరాజ్ ప్రదర్శనపై...
సిరాజ్ తొలి రంజీ మ్యాచ్‌కు (2015లో సర్వీసెస్‌తో) నేనే హైదరాబాద్ కెప్టెన్‌గా ఉండి క్యాప్ అందించా. అప్పటి నుంచి అతనితో సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు కలిసి టెస్టులు ఆడాం. అంతులేని ఆత్మవిశ్వాసమే అతని బలం. మైదానంలో ఉన్నప్పుడు, బౌలింగ్ చేసేటప్పుడు ఆ జోష్, పట్టుదల కనిపిస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల్లోనూ సిరాజ్ చాలా బాగా ఆడాడు. వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి అతను ఆడిన ఆటను ప్రశంసించకుండా ఉండలేం.
Comments
Please login to add a commentAdd a comment