ప్రపంచ క్రికెట్‌లో అతడొక కింగ్. అతడికి సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. తండ్రి ఆశయం కోసం ఎంతటి సవాలునైనా ఎదిరించగల సాహసి. ప్రాణంలా ప్రేమించిన తండ్రి మరణం బాధిస్తున్నా.. ఆటగాడిగా తన విధిని నిర్వర్తించిన అంకితభావం గల వ్యక్తి. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా సరే అతడు బరిలోకి దిగనంతవరకే.. అతడు మైదానంలో అడుగుపెడితే ప్రత్యర్ధి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.
రికార్డులను తన ఇంటి పేరుగా మార్చుకుంటూ వరల్డ్ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసుకున్న ధీరుడు అతడు. క్రికెట్ దేవుడు సచిన్‌ను మరిపించేలా పరుగుల ప్రవాహంతో అనేక రికార్డులు బద్దలు కొట్టడం.. మరెన్నో రికార్డుల మీద గురి పెట్టడం అతడికే చెల్లింది.
కొండంత లక్ష్యాన్ని కూడా సరే అవలీలగా కరిగించే ఛేజ్ మాస్టర్. వరల్డ్‌క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు మారుపేరు అతడు. అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. "విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు".
ఇది సచిన్ వన్డే సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేసినప్పుడు కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చెసిన వాఖ్య ఇది. ఇది నిజంగా అక్షర సత్యం. కోహ్లి నేడు తన 36వ పుట్టిన రోజు జరుపునకుంటున్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించిన పలు అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
👉: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 295 వన్డేలు ఆడిన కోహ్లి మొత్తంగా 50 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ నమోదు చేసిన విరాట్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(49) పేరిట ఉండేది. ఆ రికార్డును ఎవరూ టచ్ చేయలేరని అంతా అనుకున్నారు. కానీ సచిన్ రికార్డు బద్దలు కొట్టి కోహ్లి చరిత్రకెక్కాడు. తన ఆటతో సచిన్‌ను కూడా ఫిదా చేసి.. క్రికెట్ దేవుడినే మైమరిపించాడు.
👉: వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. 2023 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. కోహ్లి కేవలం 278వ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్(321) పేరిటే ఉండేది.
👉: మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కూడా కోహ్లినే. ఇప్పటివరకు 538 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 21 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. టెస్టుల్లో మూడుసార్లు, వన్డేల్లో 11సార్లు, టీ20ల్లో 7సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కింగ్ కోహ్లి సొంతం చేసుకున్నాడు.
👉: వన్డే ప్రపంచకప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు కలిగి ఉన్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లి ఏకంగా 765 పరుగులు చేసి ఈ ఫీట్‌ను సాధించాడు.
👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజం తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివకు 125 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 39 హాఫ్ సెంచరీలు చేశాడు. బాబర్ కూడా సరిగ్గా 39 హాఫ్ సెంచరీలు సాధించాడు.
👉: అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3500 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డు సాధించాడు. కేవలం 96 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లి
ఈ ఫీట్ నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment