
జలంధర్ : ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. మొదట కరోనా కలకలం రేపగా.. తర్వాత రైనా, హర్భజన్‌లు లీగ్లో ఆడడం లేదంటూ బాంబ్ పేల్చడం వంటివి జరిగాయి. రైనా విషయంలో కారణాలు ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోయినా.. లీగ్ మధ్యలోనైనా జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తానే స్వయంగా వెల్లడించాడు. ఇక హర్భజన్ విషయానికి వస్తే.. తల్లి అనారోగ్యం దృష్యా, వ్యక్తిగత కారణాల రిత్యా తాను కుటుంబంతో సమయం గడపాల్సి ఉందని.. అందుకే లీగ్‌కు కూడా దూరమవుతున్నట్లు పేర్కొన్నాడు.
హర్భజన్ నిర్ణయాన్ని సీఎస్‌కే కూడా స్వాగతిస్తూ.. అతనికి మద్దతుగా నిలిచింది. అయితే కొంతమంది పనికిమాలిన వారు మాత్రం కరోనా భయంతోనే హర్భజన్ చెన్నై జట్టుకు దూరంగా ఉన్నాడంటూ ఆరోపించారు. దీంతో పాటు సీఎస్‌కే జట్టులో 13 మందికి కరోనా సోకడంతో భజ్జీ మరింత బయపడిపోయాడని విమర్శించారు. దీనిపై హర్భజన్ స్నేహితుడొకరు ఘాటుగానే స్పందిస్తూ.. భజ్జీ విషయమై క్లారిటీ ఇచ్చాడు. (చదవండి : కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై నమ్మకం ఉంది)
'కేవలం వ్యక్తిగత కారణాల రిత్యా హర్భజన్ ఈ ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు. అంతేకానీ దుబాయ్‌లో ఉన్న పరిస్థితులు దృశ్యా అతను దూరమవలేదు. ఐపీఎల్ 13వ సీజన్ ఆడేందుకు భజ్జీ జట్టుతో పాటు దుబాయ్‌కు వెళ్లలేదు. తల్లి అనారోగ్యం దృష్యా ఫ్యామిలీతో గడపాలనే నిర్ణయంతో గత మూడు నెలలుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ సమయంలో అతను ఐపీఎల్ ఆడినా ఆట మీద ఎక్కువ ఫోకస్ చేయలేడు. అందుకే తనకు కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఒకవేళ భజ్జీ ఐపీఎల్ ఆడితే రెండు కోట్లు దక్కుతాయి.. కానీ అది 2 కోట్లా లేక 20 కోట్లా అన్నది ముఖ్యం కాదు.. ఎందుకంటే భజ్జీ దృష్టిలో డబ్బు అనేది చివరి ఆప్షన్.. కుటుంబ విలువవలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఒకవేళ మీ కుటుంబంలో మీ భార్యకో లేక తల్లికో ఇలాగే జరిగితే అప్పడు మీకు పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తారే తప్ప బుర్ర పెట్టి ఆలోచించరు' అంటూ చురకలంటించాడు. (చదవండి : హర్భజన్ సింగ్ ఆడటం లేదు)
2008 నుంచి 2017 వరకు పది సీజన్ల పాటు హర్భజన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.2018లో చెన్నై జట్టులోకి వచ్చిన అతను టీమ్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది రన్నరప్‌గా నిలవడంలో కూడా భజ్జీ పాత్ర ఉంది. ఓవరాల్‌గా 160 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7.05 ఎకానమీతో 150 వికెట్లు పడగొట్టాడు. కాగా హర్భజన్ గైర్హాజరీతో చెన్నై జట్టుకు ముగ్గురు స్పిన్నర్లు మాత్రమే మిగిలారు. లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, మిచెల్ సాంట్నర్, పియూష్ చావ్లాలు జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment