బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర వైఫల్యం తర్వాత భారత జట్టు ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం కాస్త ఘాటుగా స్పందించాడు. భారత జట్టులో "సూపర్ స్టార్ సంస్కృతిని వీడాలని, కేవలం ప్రదర్శన ఆధారంగా మాత్రమే భవిష్యత్తు సిరీస్‌లకు ఎంపిక చేయాలని బీసీసీఐకి భజ్జీ సూచించాడు.
ఈ క్రమంలో హర్భజన్ సింగ్ తాజాగా మరో క్రిప్టిక్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. దీంతో ఈ మాజీ క్రికెటర్ ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
బీజీటీ ఓటమి తర్వాత భజ్జీ ఏమన్నాడంటే?
"ప్రస్తుతం భారత క్రికెట్‌లో సూపర్ స్టార్ సంస్కృతి బాగా పెరిగింది. జట్టుకు పేరు ప్రఖ్యాతుల ఉన్న వాళ్లు కాదు, బాగా ప్రదర్శన చేసేవారు కావాలి. సూపర్ స్టార్లు కంటే బాగా ఆడేవారు ఉంటేనే జట్టు విజయ పథంలో ముందుకు వెళ్తుంది. సూపర్ స్టార్ కావాలనుకునే వారు ఇంట్లోనే ఉండి క్రికెట్ ఆడాలి.
మరో ఆరు నెలలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇప్పటి నుంచే ఇంగ్లండ్ టూర్‌కు ఎవరు వెళ్తారు? ఎవరికి చోటు దక్కదు? అన్న చర్చ మొదలైంది. ఇది సాధారణంగా ఎప్పుడూ జరిగేదే. నావరకు అయితే బాగా ఆడే వారే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలి. అప్పట్లోనే కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లనే జట్టు నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు సూచించారు.
కాబట్టి ఇప్పుడు కూడా బీసీసీఐ, సెలక్టర్లు అదే పనిచేయాలి. ముఖ్యంగా సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. భారత్ సూపర్‌స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి. ఆటగాళ్లను వారి ప్రదర్శన బట్టి ఎంపిక చేయాలి"భజ్జీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
విరాట్ కోహ్లి, రోహిత శర్మ వంటి స్టార్ ప్లేయర్లను ఉద్దేశించే హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు తెగ చర్చించుకున్నారు. అంతలోనే తాజా పోస్ట్‌తో భజ్జీ మరోసారి వార్తలోకెక్కాడు. కాగా బోర్డర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. బీజీటీని భారత్ చేజార్చుకోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణ ప్రదర్శన కనబరిచారు.
కోహ్లి ఓ సెంచరీ చేసినప్పటికి, రోహిత్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. అటు కెప్టెన్సీ, ఇటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఈ సీనియర్ ద్వయం టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలకాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
అయితే భారత్ తదుపరి టెస్టు పర్యటనకు మరో ఆరు నెలలు ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. కోహ్లి, రోహిత్ టెస్టుల్లో కొనసాగుతారా లేదా అన్నది తెలియాలంటే మరో 6 నెలలు ఆగక తప్పదు.
చదవండి: SA T20: జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చిత్తు
Comments
Please login to add a commentAdd a comment