ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే త‌క్కువ‌! | Hardik Pandya Hides His Face In Shame Almost Cries In Team Bus | Sakshi
Sakshi News home page

ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే త‌క్కువ‌!

Apr 17 2026 4:49 PM | Updated on Apr 17 2026 5:50 PM

Hardik Pandya Hides His Face In Shame Almost Cries In Team Bus

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ వైఫ‌ల్యం కొన‌సాగుతుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో  ఒక్క విజ‌యం మాత్ర‌మే సాధించిన ముంబై గురువారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ దారుణ ఓట‌మిని చ‌విచూసింది. ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల విధ్వంసంతో ముంబై బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. మ్యాచ్‌లో ఓట‌మితో ముంబై ఇండియ‌న్స్ ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానానికి ప‌డిపోయింది. 

ముంబై ఓట‌మి త‌ర్వాత‌ ఢీలా ప‌డిన ఆ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బస్సులో హోట‌ల్ రూమ్‌కు బ‌య‌ల్దేరిన స‌మ‌యంలో మీడియా కంట ప‌డ్డాడు. మీడియాను చూసి ముఖం చాటేసిన పాండ్యా తన చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చినంత ప‌ని చేశాడు. త‌న ప‌క్క‌నే కూర్చున్న సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా డ‌ల్‌గా క‌నిపించాడు. 

ప‌క్క‌నే కూర్చున్న సూర్య‌తో కూడా ఏం మాట్లాడ‌కుండా బ‌స్ అద్దంవైపు తిరిగిన పాండ్యా బ‌య‌ట‌కు చూస్తూ కంట‌త‌డి పెట్టిన‌ట్లు కెమెరాల‌కు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక కెప్టెన్‌గానే గాక ఆట‌గాడిగానూ పాండ్యా విఫ‌ల‌మ‌వుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు క‌లిపి 27 స‌గ‌టుతో కేవ‌లం 81 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్ర‌మే తీసిన పాండ్యా ఇచ్చుకున్న ప‌రుగులుఎకాన‌మీ రేటు 11.16గా ఉండ‌డం గ‌మ‌నార్హం. 

పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవ‌డం దగ్గ‌రి నుంచి పాండ్యాకు ఏదీ క‌లిసిరాలేదు. బ్యాటింగ్‌లో 14 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ఈ ఆల్‌రౌండ‌ర్ మూడు ఓవ‌ర్లు వేసి 39 ప‌రుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. 

క్వింట‌న్ డికాక్ సెంచ‌రీతో మెర‌వ‌గా, న‌మ‌న్ ధిర్ అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. అనంత‌రం పంజాబ్ ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, అయ్య‌ర్ విధ్వంసంతో 16.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 198 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఇప్ప‌టికే నాలుగు ఓట‌ముల‌తో ప‌ట్టిక‌లో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియ‌న్స్‌కు గుజ‌రాత్ టైటాన్స్‌తో ఏప్రిల్ 20న జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కీల‌కం కానుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్ వేదిక కానుంది.

చదవండి: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన దృశ్యం..

Advertisement
 
Advertisement
Advertisement