
ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా టి20 సిరీస్‌పై కన్నేసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా తొలి టి10 ఆడేందుకు రాంచీలో అడుగుపెట్టింది. సీనియర్లు అయిన రోహిత్, కోహ్లి లేకుండానే పాండ్యా కెప్టెన్సీలో మరో టి20 సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో సెమీస్ వైఫల్యం అనంతరం బీసీసీఐ కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ నుంచి పాండ్యాకు అప్పజెప్పింది.
వచ్చే టి20 వరల్డ్‌కప్ వరకు సరికొత్త జట్టును తయారు చేయాలనే లక్ష్యంతో పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వగా.. దానిని అతను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఐర్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకలపై టి20 సిరీస్‌లు గెలిచిన పాండ్యా.. తాజాగా మరోసారి రోహిత్ గైర్హాజరీలో కివీస్‌తో టి20 సిరీస్‌కు టీమిండియాను నడిపించనున్నాడు. ఇక శుక్రవారం(జనవరి 27న) రాంచీ వేదికగా కివీస్, భారత్‌ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది.
ఇక రాంచీ టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి స్వస్థలమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా బుధవారం రాత్రి టీమిండియా రాంచీలో అడుగుపెట్టింది. మరుసటి రోజే హార్దిక్ పాండ్యా తన అభిమాన ఆటగాడు ధోనితో గడిపేందుకు అతని ఇంటికి వెళ్లాడు. ధోని ఇంట్లో ఉన్న బైక్ గ్యారేజీ సెంటర్‌లో సరదాగా గడిపాడు.
ఈ సందర్భంగా పాండ్యా.. ధోనిని మోటార్‌సైకిల్‌లో సైడ్‌కార్‌లో ఎక్కించుకున్న ఫోటోను షేర్ చేశాడు. ''త్వరలో షోలే-2 మీ ముందుకు రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'' అంటూ కామెంట్ చేశాడు. షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది.
భారతీయ సినిమా గర్వించదగ్గ షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్రలు ''యే దోస్తీ హమ్ నహీ చోడేంగే..'' పాట సందర్భంగా ఇదే తరహాలో బైక్‌పై వెళ్లడం గుర్తుండే ఉంటుంది. డ్రైవర్ సీటులో ధర్మేంద్ర ఉంటే.. పక్కన సైడ్‌కార్‌లో అమితాబ్ కూర్చొని పాట పాడుకుంటూ వెళ్తారు. అచ్చం అదే ఫోటోని రిపీట్ చేసిన పాండ్యా.. మోటార్‌సైకిల్‌ను తాను డ్రైవ్ చేయగా.. పక్కన సైడ్‌కార్‌లో ధోని దర్జాగా కూర్చొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sholay 2 coming soon 😉 pic.twitter.com/WixkPuBHg0
— hardik pandya (@hardikpandya7) January 26, 2023
Comments
Please login to add a commentAdd a comment