మెకానికల్‌ ఇంజనీర్‌! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి | Happy Birthday Anil Kumble: Relieve Anil Kumble's Historic 10 Wicket Haul Against Pakistan And Interesting Facts - Sakshi
Sakshi News home page

మెకానికల్‌ ఇంజనీర్‌! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి! ఒకే ఒక్కసారి కెప్టెన్‌గా..

Published Tue, Oct 17 2023 6:22 PM | Last Updated on Tue, Oct 17 2023 7:01 PM

HBD: Relive Anil Kumble Historic 10 Wicket Haul Against Pakistan Intresting Facts - Sakshi

పాక్‌ 1-10 బ్యాటర్లను అవుట్‌ చేసి.. టీమిండియాను గెలిపించి(PC: Video Grab)

‘‘మంచి, చెడులను అర్థం చేసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే కచ్చితంగా విజయవంతమవుతామనే నమ్మకం లేదు. ఒకవేళ అనుకున్నది సాధించలేక నిరాశలో కూరుకుపోతే.. దానిని ఎలా అధిగమించాలో, భవిష్యత్‌ పరిణామాలకు ఎలా సంసిద్ధం కావాలో కూడా చదువు మనకు నేర్పిస్తుంది’’- అనిల్‌ కుంబ్లే

టీమిండియా స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పుట్టినరోజు నేడు(అక్టోబరు 17). ఈ సందర్భంగా సచిన్‌ టెండుల్కర్‌, హర్భజన్‌ సింగ్‌ వంటి టీమిండియా మాజీ క్రికెటర్లు సహా అభిమానుల నుంచి ‘జంబో’కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

మెకానికల్‌ ఇంజనీర్‌!
ఈ నేపథ్యంలో అనిల్‌ కుంబ్లేకు సంబంధించిన కొన్ని  ఆసక్తికర విషయాలు మీకోసం.. కర్ణాటకలోని బెంగళూరులో 1970లో జన్మించాడు కుంబ్లే. చదువు, క్రికెట్‌.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాడు.

ముందు టీమిండియాకు ఆడి.. తర్వాత పట్టా పుచ్చుకున్నాడు
టీమిండియా తరఫున 1991- 92లో రాష్ట్రీయ విద్యాలయ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ డిగ్రీ అందుకున్న కుంబ్లే.. అంతకంటే ఓ ఏడాది ముందే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

జంబో ఖాతాలో ఎన్ని వంద వికెట్లంటే?
షార్జాలో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ సందర్భంగా అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2008లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన కుంబ్లే.. తన కెరీర్‌లో మొత్తంగా 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు.

ఆయా ఫార్మాట్లలో వరుసగా 619, 337 వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతలు సాధించాడు ఈ రైట్‌ఆర్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌. కాగా టీమిండియా కెప్టెన్‌గానూ అనిల్‌ కుంబ్లే సేవలు అందించిన విషయం తెలిసిందే.

ఒకే ఒక్క వన్డేకు కెప్టెన్‌గా
2007లో భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కుంబ్లే 14 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. కానీ, వన్డే ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా మాత్రం కుంబ్లేకు అవకాశం రాలేదు. అయితే, టెస్టు సారథి కావడానికి ముందే అంటే 2002లో ఇంగ్లండ్‌తో వన్డేలో జట్టును మందుండి నడిపించాడు. 

టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో నో ఎంట్రీ
టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన కుంబ్లే.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మాత్రం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

ఐపీఎల్‌లో హవా
మొత్తంగా 42 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి.. 45 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు 4- వికెట్‌ హాల్స్‌, ఒక 5-వికెట్‌ హాల్‌ ఉంది. కాగా మొట్టమొదటిసారిగా 2007లో ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో కుంబ్లేకు సెలక్టర్లు చోటివ్వలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో కుంబ్లేకు ఛాన్స్‌ దక్కలేదు.

చివరిగా బెర్ముడాతో
వెస్టిండీస్‌లో... బెర్ముడాతో 2007 వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా అనిల్‌ కుంబ్లే తన చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో కుంబ్లే.. త్రీ- వికెట్‌ హాల్‌తో మెరిశాడు. మొత్తంగా 38 పరుగులిచ్చి.. బెర్ముడా కెప్టెన్‌ ఇర్విన్‌ రొమేనీ, మిడిలార్డర్‌ బ్యాటర్‌ జెనీరో టకర్‌, టెయిలెండర్‌ మలాచి జోన్స్‌ వికెట్లు పడగొట్టాడు.

చిరస్థాయిగా నిలిచిపోయే ప్రదర్శన
ఇక అనిల్‌ కుంబ్లే కెరీర్‌తో పాటు టీమిండియా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతం 1999, ఫిబ్రవరి 7న జరిగింది. వసీం అక్రం సారథ్యంలోని పాకిస్తాన్‌ జట్టు 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది.

సొంతగడ్డపై పరువు నిలబెట్టేందుకు
తొలి టెస్టులో 12 పరుగుల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచి టీమిండియాకు సవాల్‌ విసిరింది. ఈ క్రమంలో సొంతగడ్డపై దాయాదితో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో భారత జట్టు ఢిల్లీలో రెండో టెస్టుకు సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లో 252 పరుగుల వద్ద భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ ముగించగా.. పాక్‌ కథ 172 పరుగులకే ముగిసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ అజారుద్దీన్‌ సారథ్యంలోని టీమిండియా 339 పరుగులు చేసి భారీ ఆధిక్యంలో నిలిచింది.

పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి..
ఈ క్రమంలో 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ అనిల్‌ కుంబ్లే చావుదెబ్బ కొట్టాడు. పది వికెట్లు తానే తీసి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. తొలుత ఓపెనర్‌ షాహిద్‌ ఆఫ్రిదితో మొదలుపెట్టిన కుంబ్లే.. అందరినీ తానే పెవిలియన్‌కు పంపాడు.

ఆ పది మంది వీరే
ఆఫ్రిదితో పాటు సయీద్‌ అన్వర్‌, ఇయాజ్‌అహ్మద్‌, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, మహ్మద్‌ యూసఫ్‌, మొయిన్‌ ఖాన్‌, సలీం మాలిక్‌, వసీం అక్రం, ముస్తాక్‌ అహ్మద్‌, సక్లెయిన్‌ ముస్తాక్‌, వకార్‌ యూనిస్‌ వికెట్లు పడగొట్టి.. 10- వికెట్‌ హాల్‌ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

టీమిండియా విజయంలో, సిరీస్‌ సమం కావడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కుంబ్లే పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం (అక్టోబరు 17) బీసీసీఐ ఇందుకు సంబంధించిన వీడియో షేర్‌ చేసింది.

చదవండి: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌ ఆటగాళ్లకు వైరల్‌ ఫీవర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement