అలా చేయడం ముమ్మాటికి తప్పే: గిల్‌పై తండ్రి విమర్శలు | He Should Have Continued To Open: Gill Father Discontent With His Move | Sakshi
Sakshi News home page

అది ముమ్మాటికి తప్పే.. తనిప్పుడు పెద్దవాడు అయ్యాడు కాబట్టే: గిల్‌ తండ్రి

Published Fri, Mar 8 2024 6:04 PM | Last Updated on Fri, Mar 8 2024 6:27 PM

He Should Have Continued To Open: Gill Father Discontent With His Move - Sakshi

శుబ్‌మన్‌ గిల్‌- లఖ్విందర్‌ (PC: BCCI/Jio Cinema)

India vs England, 5th Test Day 2: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ఉద్దేశించి అతడి తండ్రి, చిన్ననాటి కోచ్‌ లఖ్విందర్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా కాకుండా.. వన్‌డౌన్‌లో ఆడాలనుకున్న గిల్‌ నిర్ణయం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు.

కాగా అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టిన పంజాబీ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌..  ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మూడు ఫార్మాట్లలో ఓపెనింగ్‌ జోడీగా జట్టులో పాతుకుపోయాడు.

అయితే, ముంబై బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ అరంగేట్రం నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌ మూడోస్థానానికి డిమోట్‌ అయ్యాడు. ఛతేశ్వర్‌ పుజారా స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. కొత్త పాత్రలో ఒదిగేక్రమంలో ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.

వరుసగా 10 ఇన్నింగ్స్‌పాటు ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు గిల్‌. అయితే, ఆ తర్వాత నెమ్మదిగా వన్‌డౌన్లో బ్యాటింగ్‌ చేసేందుకు అలవాటు పడ్డాడు. తాజాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో శతకంతో సత్తా చాటిన గిల్‌.. ధర్మశాలలోనూ సెంచరీ(110)తో చెలరేగాడు.

స్టోక్స్‌ బృందంతో జరుగుతున్న నామమాత్రపు ఐదో టెస్టులో రోహిత్‌తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు గిల్‌ తండ్రి లఖ్విందర్‌ ధర్మశాలకు విచ్చేశాడు. ఈ సందర్భంగా పుత్రోత్సాహంతో పొంగిపోతూనే.. అతడి ఆట తీరుపై విమర్శలు చేశాడు.

‘‘తను ఓపెనర్‌గానే కొనసాగాల్సింది. వన్‌డౌన్‌లో ఆడటం సరైన నిర్ణయం కానేకాదు. డ్రెసింగ్‌రూంలో ఎంత ఎక్కువసేపు కూర్చుంటే.. అంతగా ఒత్తిడి పెరుగుతుంది.

నంబర్‌ 3 అనేది ఓపెనింగ్‌ స్థానమూ కాదు.. అలాగని మిడిలార్డరూ కాదు. కాబట్టి సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఏదేమైనా తనదైన సహజమైన శైలిలో ఆడితేనే ఏ ఆటగాడైనా అనుకున్న ఫలితాలను రాబట్టగలడు.

అయినా.. తన నిర్ణయాలలో నేను జోక్యం చేసుకోను. కేవలం తనకు శిక్షణ ఇవ్వడం వరకు నా బాధ్యత. తనిప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోగల పెద్దవాడై పోయాడు. తను టీనేజర్‌గా ఉన్నపుడు మాత్రమే తన తరఫున నేను నిర్ణయాలు తీసుకునేవాడిని’’ అని లఖ్విందర్‌ సింగ్‌ తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement