
వచ్చే సీజన్‌లో ఐపీఎల్ ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షలకు పైమాటే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2024 సీజన్‌లో స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షల 36 వేల 607 రూపాయలు. లీగ్ క్రికెట్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని మొత్తం. ఏ బౌలర్ కలలోనూ ఇంత మొత్తాన్ని ఊహించి ఉండడు.
అయితే స్టార్క్‌కు ఇంత మొత్తం లభించాలంటే అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు ముందే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ ప్లే ఆఫ్స్ దశ దాటి ఫైనల్స్‌కు చేరితే స్టార్క్‌కు లభించే మొత్తంలో కోత పడుతుంది. వచ్చే సీజన్‌లో కేకేఆర్ ఫైనల్స్‌కు చేరే క్రమంలో దాదాపుగా 16 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. స్టార్క్ 16 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే ఒక్కో బంతికి లభించే మొత్తం 6.44 లక్షలకు తగ్గిపోతుంది.
కాగా, దుబాయ్‌లోని కోకోకోలా ఎరినాలో ఇవాళ (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మిచెల్ స్టార్క్‌ను 24 కోట్ల 75 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి లభించే అత్యధిక ధర ఇదే. స్టార్క్‌కు ఇంత భారీ ధర దక్కక ముందు అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు కూడా ఇంచుమించు ఈ స్థాయి ధరనే లభించింది.
కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు వరకు ఐపీఎల్ ఆల్‌టైమ్ అత్యధిర ధర 18.5 కోట్లుగా ఉండింది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్‌ను ఈ రికార్డు ధరకు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment