టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో హిట్‌మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని.. అతడు ఈసారి మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. లేనిపక్షంలో.. ట్రేడింగ్ ద్వారానైనా వేరే ఫ్రాంఛైజీకి బదిలీ కావొచ్చని అభిప్రాయపడ్డాడు.
ఐదుసార్లు ట్రోఫీ అందించి
ఐపీఎల్‌లో ఓ జట్టును అత్యధిక సార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత రోహిత్ శర్మ సొంతం. అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్- 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదురైనా గతేడాది ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది.
రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలు
అయినప్పటికీ ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తన కెప్టెన్‌ను మార్చింది. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకుని సారథిగా నియమించింది. దీంతో రోహిత్‌ను అవమానించిన జట్టుకు మేము మద్దతుగా నిలవబోమంటూ అభిమానులు ముంబై ఫ్రాంఛైజీతో పాటు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
దారుణ ఫలితం
ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా సారథ్యంలో ఐపీఎల్-2024లో ముంబై దారుణ ఫలితం చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుతో రోహిత్‌కు సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ.. తనను అవమానకరరీతిలో కెప్టెన్సీ తప్పించారని అతడు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ముంబై జట్టుతో రోహిత్ ప్రయాణం ముగిసింది
ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా రోహిత్ ముంబైని వీడనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల ఆధారంగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతాడా లేదా? అన్నది ప్రశ్నార్థకం. అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడు ఇక ఆ ఫ్రాంఛైజీతో ఉండడు.
అతడేమీ ధోని కాదు
ఎందుకంటే.. మహేంద్ర సింగ్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్ మాదిరి ముంబై- రోహిత్ మధ్య అలాంటి అనుబంధం లేదనిపిస్తోంది. అందుకే రోహిత్ బయటకు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముంబై సైతం అతడిని రిటైన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి రోహిత్ ట్రేడ్ విండో ద్వారా లేదంటే మెగా వేలంలోకి రావడం ద్వారా వేరే జట్టుకు మారే అవకాశం ఉంది.
నాకు తెలిసినంత వరకు ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసింది’’ అని పేర్కొన్నాడు. విభేదాలు వచ్చిన తర్వాత కలిసి ప్రయాణించడం కుదరబోదని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
ధోని-చెన్నై అనుబంధం వేరు
కాగా రోహిత్ మాదిరే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని సైతం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2008 నుంచి అదే ఫ్రాంఛైజీలో కొనసాగుతున్న తలా... ఈ ఏడాది తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు చెన్నై జట్టు పగ్గాలు అప్పగించాడు. అంతేకాదు వేలం దగ్గర నుంచి తుదిజట్టు ఎంపిక దాకా చెన్నై ఫ్రాంఛైజీ ధోనికి పూర్తి స్వేచ్ఛనిస్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నమని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్!
Comments
Please login to add a commentAdd a comment