సూర్యకుమార్ వల్లే మూడో స్థానంలో అవకాశం
హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ మనోగతం
భారత టి20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్‌ను ఒప్పించి దక్షిణాఫ్రికా గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టి భారత టి20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న తిలక్ వర్మ... మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన భవిష్యత్ లక్ష్యమని అంటున్నాడు.
అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా దేశవాళీల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయిన తిలక్ వర్మ... అవకాశం వస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా... బౌలింగ్‌పై కూడా దృష్టి సారించడంతో జట్టులో సమతుల్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు.
అహ్మదాబాద్‌లో జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ... కర్ణాటకపై రికార్డు ఛేదన తర్వాత తన భవిష్యత్తు లక్ష్యాలను వివరించాడు. తిలక్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే...
» విజయ్ హజారే టోర్నీలో భాగంగా కర్ణాటకతో మ్యాచ్‌లో 99 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తున్న అనే విషయాన్ని పట్టించుకోలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆ ఓవర్‌లో భారీ షాట్లు ఆడాలని అనుకున్నా... అది కాస్త ఫలించలేదు. ఒక ఆటగాడు 45వ ఓవర్ వరకు క్రీజులో నిలిస్తే 380–400 స్కోరు కూడా ఛేదించగలమని జట్టు సమావేశాల్లో ఎన్నోసార్లు చెప్పాను. జట్టును గెలిపించేంత వరకు క్రీజులో ఉండాలనుకున్నా కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదు.
» కీలక సమయంలో రాణించి జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. అంతిమంగా జట్టు విజయం సాధించడమే ముఖ్యం. నా ఇన్నింగ్స్‌తో అది సాధ్యమైనందుకు ఆనందం రెండింతలైంది.
» దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో చర్చించా. నాలుగో స్థానంలో సూర్యకు మెరుగైన రికార్డు ఉందనే విషయం గుర్తుచేశా. ఆ ప్లేస్‌లో అతడు గతంలో సెంచరీలు సాధించాడు. నాకు మూడో స్థానంలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను అని చెప్పా. దానికి సూర్యకుమార్ ఒప్పుకోవడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కింది.
» వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బలంగా భావించా. అందుకు తగ్గట్లే దక్షిణాఫ్రికాపై వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించా. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఎంతో బాగుంటుంది.
» అండర్–19 స్థాయికి ముందు వరకు నేను ఓపెనర్‌గానే బరిలోకి దిగే వాడిని. స్వింగ్ అవుతున్న బంతులను ఆడేందుకు ఇష్టపడతా. పరిస్థితులు సవాలు విసురుతున్నప్పుడు నాలోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. ముందుగా క్రీజులో అడుగు పెడితే... అదనపు సమయం లభించడంతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి.
» భారత్ ‘ఎ’తరఫున, దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేశా. అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా రంజీ ట్రోఫీలో నిరూపించుకునేందుకు తగినన్ని అవకాశాలు లభించలేదు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా ఉన్నా. నా వరకు శక్తివంచన లేకుండా ప్రయతి్నస్తున్నా.
» మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నా. జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించి పెట్టడమే నా లక్ష్యం. గతేడాది ఐపీఎల్ నుంచే బౌలింగ్‌పై మరింత దృష్టి సారించా. ఎర్ర బంతితో ఎక్కువ బౌలింగ్ సాధన చేస్తున్నా. దాని వల్ల టి20, వన్డే క్రికెట్‌లో ఆఫ్ స్పిన్నర్‌గా మరింత ప్రభావం చూపగలనని నమ్ముతున్నా.
» జట్టును సమతుల్యంగా ఉంచేందుకు నా వంతు కృషి చేస్తా. అందుకోసం బౌలింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నా. బౌలింగ్ చేయగల బ్యాటర్ ఉంటే మేనేజ్‌మెంట్‌కు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. రానున్న మ్యాచ్‌ల్లో మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోవడం ముఖ్యం. అందుకు నేను సిద్ధం.
Comments
Please login to add a commentAdd a comment