4 పరుగులతో ఓడిన హైదరాబాద్
కోల్‌కతా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాలి. ఒక దశలో గెలవడానికి 24 బంతుల్లో 76 పరుగులు కావాలి. దీంతో కోల్‌కతా విజయం లాంఛనమే అనిపించింది. కానీ హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63; 8 సిక్స్‌లు) భారీ సిక్సర్లు ఒక్కసారిగా హైదరాబాద్ విజయానికి ఊపిరిపోశాయి. 17, 18, 19వ ఓవర్లలో వరుసగా 16, 21, 26 పరుగులు వచ్చాయి. వరుణ్ 3 సిక్సర్లు ఇవ్వగా...స్టార్క్ ఓవర్లో క్లాసెన్ 3, షహబాజ్ ఒక సిక్సర్ బాదారు! అంతే ఆఖరి 6 బంతులకు 13 పరుగులు సన్‌రైజర్స్ వైపు మొగ్గేలా చేసింది.
హర్షిత్ రాణా వేసిన ఈ ఓవర్లో తొలి బంతికే క్లాసెన్ సిక్స్ బాదడంతో 5 బంతుల్లో 7 పరుగులు హైదరాబాద్‌ను సంబరాల్లో ముంచింది. కానీ హర్షిత్ (3/33) వైవిధ్యమైన బంతులతో రెండే పరుగులిచ్చి షహబాజ్ (16; 1 ఫోర్, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లను అవుట్ చేశాడు. చివరి బంతికి గెలవాలంటే 5 పరుగులు కావాల్సి ఉండగా కమిన్స్ సింగిల్ కూడా తీయలేకపోయాడు. దాంతో కోల్‌కతా 4 పరుగులతో అనూహ్య విజయం సాధించింది. దీంతో గెలుపుదారిలో పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ఈ ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా రెండో ఓవర్ నుంచే కష్టాల్లో పడింది.
నరైన్ (2), వెంకటేశ్ అయ్యర్ (7), శ్రేయస్ అయ్యర్ (0), నితీశ్ రాణా (9) చేతులెత్తేశారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (40 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా... 14వ ఓవర్లో అతనూ అవుటయ్యాడు. కోల్‌కతా స్కోరు 119/6. అప్పుడు క్రీజులోకి వచ్చిన రస్సెల్ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) చాన్నాళ్ల తర్వాత విధ్వంసరచన చేశాడు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీస్కోరు చేసింది. మిగిలిన 6.1 ఓవర్లలోనే జట్టు 89 పరుగులు చేస్తే అందులో రసెల్ ఒక్కడివే 64 పరుగులంటే... హైదరాబాద్ బౌలర్లు కూడా ప్రేక్షకులు కావాల్సివచ్చింది.
రసెల్ 20 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. నటరాజన్ 3, మయాంక్ మార్కండే 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసి ఓడింది. మయాంక్ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ (19 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే స్వల్ప వ్యవధిలో మార్క్‌రమ్ (18), రాహుల్ త్రిపాఠి (20) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జాన్సెన్ (బి) మార్కండే 54; నరైన్ రనౌట్ 2; వెంకటేశ్ (సి) జాన్సెన్ (బి) నటరాజన్ 7; శ్రేయస్ (సి) కమిన్స్ (బి) నటరాజన్ 0; నితీశ్ (సి) త్రిపాఠి (బి) మార్కండే 9; రమణ్‌దీప్ (సి) మార్కండే (బి) కమిన్స్ 35; రింకూ సింగ్ (సి) మార్కండే (బి) నటరాజన్ 23; రసెల్ నాటౌట్ 64; స్టార్క్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–23, 2–32, 3–32, 4–51, 5–105, 6–119, 7–200. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–51–0, జాన్సెన్ 3–0–40–0, నటరాజన్ 4–0–32–3, కమిన్స్ 4–0–32–1, మార్కండే 4–0–39–2, షహబాజ్ 1–0–14–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) రింకూ (బి) హర్షిత్ 32; అభిషేక్ (సి) వరుణ్ (బి) రసెల్ 32; త్రిపాఠి (సి) హర్షిత్ (బి) నరైన్ 20; మార్క్‌రమ్ (సి) రింకూ (బి) వరుణ్ 18; క్లాసెన్ (సి) సుయశ్ (బి) హర్షిత్ 63; సమద్ (సి) వెంకటేశ్ (బి) రసెల్ 15; షహబాజ్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 16; జాన్సెన్ నాటౌట్ 1; కమిన్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–60, 2–71, 3–107, 4–111, 5–145, 6–203, 7–204. బౌలింగ్: స్టార్క్ 4–0–53–0, హర్షిత్ రాణా 4–0–33–3, వరుణ్ 4–0–55–1, నరైన్ 4–0–19–1, రసెల్ 2–0–25–2, సుయశ్ 2–0–18–0.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ X లక్నో
వేదిక: జైపూర్
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
గుజరాత్ X ముంబై
వేదిక: అహ్మదాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment