సొంతగడ్డపై భారత జట్టు 2012లో చివరిసారిగా, అదీ ఇంగ్లండ్ చేతిలో ఓడింది... అయితే ఆ తర్వాత ఏ ఒక్క టీమ్ కూడా మన జట్టుతో తలపడి పైచేయి సాధించలేకపోయింది. ఇంకా చెప్పాలంటే టీమిండియా వరుసగా 16 సిరీస్‌లలో విజయం సాధించగా ఇందులో 7 క్లీన్‌స్వీప్‌లు ఉన్నాయి. రెండుసార్లు ఆస్ట్రేలియా మాత్రమే సిరీస్‌ను ‘డ్రా’ చేసేందుకు కాస్త చేరువగా రాగలిగింది. నాటినుంచి ఇక్కడ ఆడిన 44 టెస్టుల్లో భారత్ మూడింటిలో మాత్రమే ఓడిందంటే మన బలం, బలగం ఏమిటో అర్థమవుతుంది.
ఇంగ్లండ్ కూడా ఇక్కడ ఆడిన గత రెండు టెస్టు సిరీస్‌లలో భారత్ చేతిలో 0–4, 1–3తో చిత్తుగా ఓడింది... ఇలాంటి స్థితిలో భారత జట్టు మరోసారి ప్రత్యర్థిని పడగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మన మేనేజ్‌మెంట్ వ్యాఖ్యలు చూస్తే పూర్తి స్థాయిలో స్పిన్ పిచ్‌లే తయారు కావడం ఖాయం. మరోవైపు గత కొంతకాలంగా దూకుడైన ఆటతో ‘బజ్‌బాల్’ అంటూ సిద్ధమైన ఇంగ్లండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల భారీ సిరీస్‌కు రంగం సిద్ధమైంది.
గత దశాబ్దకాలంలో మా జట్టుకు ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉన్నది వాస్తవమే అయినా అది ఈ సిరీస్ విజయానికి పనికి రాదు. పరిస్థితులకు తగినట్లుగా అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిందే. ఆఖరిసారిగా ఇంగ్లండే మమ్మల్ని ఇక్కడ ఓడించింది. మేం అజేయులం ఏమీ కాదు. అలాంటి భ్రమలేవీ లేవు. కాబట్టి ఏమాత్రం ఉదాసీనత కనబర్చినా ఓటమి ఎదురవుతుంది. ఎదుటివారి బలబలాలకంటే మన జట్టు వ్యూహం గురించి స్పష్టత ఉండాలి. దానిని అమలు చేయాలి కూడా.
ఇలాంటి పరిస్థితుల్లో మేమందరం ఆడాం కాబట్టి ఎలా ఆడాలో సొంత ప్రణాళికలు కూడా రూపొందించుకోవాలి. టెస్టుల్లో ఒత్తిడిని అధిగమించడమే పెద్ద సవాల్. బరిలోకి దిగి పూర్తి సత్తాను ప్రదర్శించాలి. ఎప్పటికీ సీనియర్లపైనే ఆధారపడలేం కదా. కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. లేదంటే వారు ఎప్పుడు ఆడతారు. అందుకే పటిదార్‌ను ఎంచుకున్నాం. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్
సాక్షి, హైదరాబాద్: భారత గడ్డపై మరో పెద్ద జట్టుతో టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి టెస్టులో ఇరు జట్లు తలపడతాయి. బలాబలాలు, రికార్డుపరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ శర్మ జట్టుదే పైచేయిగా కనిపిస్తుండగా... గత కొంతకాలంగా మార్పులతో కనిపిస్తూ వచ్చిన ఇంగ్లండ్‌ను పూర్తిగా తక్కువ చేయలేం. ఏ జట్టు గెలిచినా సిరీస్‌లో శుభారంభం చేస్తే ఆపై దాని ప్రభావం కనిపించడం ఖాయం.
కోహ్లి లేకుండా...
భారత్‌కు సంబంధించి తుది జట్టు విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో ఆడిన టీమ్ నుంచి సహజంగానే స్వదేశంలో మార్పులు ఖాయం. బౌలింగ్ విభాగంలో ఇద్దరు పేసర్ల స్థానాల్లో ఇద్దరు స్పిన్నర్లు వస్తున్నారు. సీనియర్ ఆటగాడు అఅశ్విన్ న్ బరిలోకి దిగడం ఖాయం. అఅశ్విన్ న్–జడేజాల స్పిన్ జోడీ చెలరేగితే ఇంగ్లండ్ ఏమాత్రం నిలబడగలదనేది ఆసక్తికరం.
గత దశాబ్దకాలంలో వీరిద్దరు సొంతగడ్డపై ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ ఉంది. కెప్టెన్ రోహిత్ కూడా దీనిపై స్పష్టత ఇవ్వకపోయినా బ్యాటింగ్‌ను దృష్టిలో పెట్టుకునే అక్షర్‌కే ప్రాధాన్యత ఉంది. ఇద్దరు పేసర్లు బుమ్రా, సిరాజ్ కొత్త బంతిని పంచుకుంటారు. కెరీర్‌లో 23 టెస్టులు ఆడిన సిరాజ్‌కు తన సొంత మైదానంలో ఇదే తొలి టెస్టు కావడం విశేషం.
ఆరంభంలో వీరిద్దరు ప్రభావం చూపించగలరు. స్టార్ బ్యాటర్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరం కావడం అభిమానులను నిరాశపర్చేదే. అయితే అతను లేకపోవడం వల్ల బ్యాటింగ్‌లో ఎంపిక సమస్య లేకుండా పోయింది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడతారు. శుబ్‌మన్ గిల్ టెస్టుల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
కోహ్లి స్థానంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ (కేఎస్) భరత్ జట్టులోకి వస్తాడు. రజత్ పటిదార్‌ను ఎంపిక చేసినా... తుది జట్టులో చోటు కష్టమే. మన బ్యాటర్లు భారీ స్కోరు అందిస్తే ఇంగ్లండ్ పని పట్టడం బౌలర్లకు పెద్ద కష్టం కాకపోవచ్చు.
ముగ్గురు స్పిన్నర్లతో...
మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. స్పిన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ముగ్గురు స్పిన్నర్లకు అవకాశమిచ్చి ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగుతోంది. నాణ్యమైన స్పిన్నర్లు కాకపోయినా... అందుబాటులో ఉన్నవారి నుంచే ఎంచుకోక తప్పలేదు. 35 టెస్టుల అనుభవం ఉన్న లెఫ్టార్మ్ స్పిన్నర్ లీచ్ కొంత వరకు ప్రభావం చూపించవచ్చు. కానీ లెగ్‌స్పిన్నర్ రేహన్ ఒకే ఒక టెస్టు ఆడగా, మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్లీకి ఇదే తొలి టెస్టు కానుంది.
అదనంగా జో రూట్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. ఇంగ్లండ్ స్పిన్నర్లు మన బ్యాటింగ్‌ను ఏమాత్రం నిలువరించగలరనేది సందేహమే అయినా... స్పిన్‌తో కనీసం ప్రయత్నమైనా చేసేందుకు ఆ జట్టు సిద్ధమైంది. సీనియర్ అండర్సన్‌ను కాకుండా మార్క్ వుడ్ రూపంలో ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా ఎంచుకుంది. బ్యాటింగ్‌లో రూట్, బెయిర్‌స్టోలపై ప్రధానంగా ఆ జట్టు ఆధారపడుతోంది.
ఓలీ పోప్ కూడా మెరుగైన బ్యాటరే అయినా... క్రాలీ, డకెట్ ఎలాంటి ఆరంభం ఇస్తారో చూడాలి. స్టోక్స్ బ్యాటింగ్‌లో ధాటిని ప్రదర్శించాలని జట్టు కోరుకుంటోంది. ముఖ్యంగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో ‘బజ్‌బాల్’ అంటూ దూకుడైన తరహా శైలితోనే టీమ్ సఫలమైంది. అయితే పూర్తి భిన్నమైన భారత పిచ్‌లపై అలాంటి మంత్రం ఎలా పని చేస్తుందో చూడాలి. ఈ జోరులో జట్టు కుప్పకూలిపోయే ప్రమాదమూ ఉంది.
పిచ్, వాతావరణం
ఉప్పల్ పిచ్ పొడిగా కనిపిస్తోంది. మరో మాటకు తావు లేకుండా స్పిన్‌కు అనుకూలించడం ఖాయం. అయితే అది ఎంత తొందరగా మొదలవుతుందనేదే ఆసక్తికరం. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతుంది.
తుది జట్లు
భారత్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి, గిల్, శ్రేయస్, కేఎల్ రాహుల్, జడేజా, భరత్,
అఅశ్విన్ న్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్ ), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, వుడ్, రేహన్, హార్లీ, లీచ్.
4 ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు 5 టెస్టులు ఆడింది. న్యూజిలాండ్‌తో 2010లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధించింది.
షోయబ్ బషీర్‌కు వీసా మంజూరు
లండన్: భారత వీసా లభించకపోవడంతో తొలి టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఊరట లభించింది. వీసా లేకపోవడంతో అతను జట్టుతో పాటు భారత్‌కు ప్రయాణించకుండా యూఏఈ నుంచి ఇంగ్లండ్‌కు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బషీర్‌కు వీసా మంజూరైందని గురువారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ‘బషీర్ తన వీసా అందుకున్నాడు.
ఈ వారాంతంలో భారత్‌కు వచ్చి అతను జట్టుతో కలుస్తాడు. సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది’ అని ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పుట్టినా... పాకిస్తాన్ మూలాలు ఉన్న కారణంగానే బషీర్ వీసాను భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని గత రెండు రోజులుగా విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ ప్రభుత్వ అధికారి కూడా ఒకరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అంతా సుఖాంతమైంది. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బషీర్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు.
Comments
Please login to add a commentAdd a comment