
నవతరం ఫాస్ట్ బౌలర్ల తీరుపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారని.. ఒత్తిడిలో చిత్తైపోయి పరుగులు సమర్పించుకుంటున్నారని విమర్శించాడు. కనీసం ఒక్కసారి కూడా ఫీల్డింగ్ మార్చకుండానే ఓవర్ పూర్తి చేస్తున్నారని.. ఇదంతా చూస్తే తనకు చిర్రెత్తుకొస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అయితే, టీమిండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడ (Kagiso Rabada) మాత్రం ఇందుకు మినహాయింపు అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోలో నేటి తరం ఫాస్ట్ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో అంతర్జాతీయ స్థాయి పేసర్ల తీరు నాకు నచ్చడం లేదు.
వాళ్లను చూస్తేనే చిరాకు..
ఒక్కసారి కూడా ఫీల్డ్ మార్చకుండానే ఓవర్ పూర్తి చేసేసి వెళ్తున్నారు. పదేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న వారు కూడా తమకేమీ పట్టదన్నట్లుగా చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను చూసినపుడు నాకైతే జట్టు పీక్కోవాలనిపిస్తుంది. చిరాకు వస్తుంది. ఇంతకంటే గొప్ప బౌలర్లను మనం చూడలేమా? అని నా మనసు ఆవేదన చెందుతుంది’’ అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
బుమ్రా, రబడ మాత్రం వేరు
అదే విధంగా.. ‘‘బుమ్రా మాత్రం ఇందుకు అతీతం. అతడు పరిపూర్ణమైన ప్యాకేజ్‌లాంటివాడు. కగిసో రబడ కూడా బుమ్రా మాదిరే పర్ఫెక్ట్. వాళ్లిద్దరు ఎలాంటి సమయంలోనైనా బౌలింగ్ చేయగలగరు. వికెట్లూ పడగొట్టగలరు. నిజంగా వాళ్లిద్దరు బంగారం. కెప్టెన్‌కు సగం పని తగ్గించేస్తారు.
ఇలాంటి వారి సంఖ్య పెరిగితేనే.. ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా ఉంటుంది. గంటకు 155 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేశారా? లేదా? అన్నది ముఖ్యం కాదు. మనలో పది రకాల నైపుణ్యాలు ఉండవచ్చు. కానీ సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించి కెప్టెన్ చెప్పిన పని పూర్తి చేస్తేనే దేనికైనా విలువ’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు.
70 శాతం మంది బౌలర్ల తీరు అలాగే
ఇక ఇదే షోలో స్టెయిన్‌తో గొంతు కలిపిన న్యూజిలాండ్ పేస్ దిగ్గజం షేన్ బాండ్.. ‘‘ఈరోజుల్లో 70 శాతం మంది బౌలర్లకు అసలు తామేం చేస్తున్నామో అన్న స్పృహ ఉండటం లేదు. కెప్టెన్లు మరింత చొరవ తీసుకోవాలి.
వారి నుంచి ఎలాంటి ప్రదర్శన కోరుకుంటాన్నారో కచ్చితంగా చెప్పాలి. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలోనూ నిక్కచ్చిగా వ్యవహరించాలి’’ అని అభిప్రాయపడ్డాడు.
బుమ్రా రీఎంట్రీ ఎప్పుడో?
కాగా ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి వెన్నునొప్పి కారణంగా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన పేసర్ లేకుండానే టీమిండియా ఈ మెగా వన్డే టోర్నీలో విజేతగా అవతరించింది. స్పిన్‌కు అనుకూలించే దుబాయ్ పిచ్‌పై అజేయ రికార్డుతో ట్రోఫీని ముద్దాడింది. ఇక బుమ్రా ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు.. రబడ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్‌లోనే ఇంటిబాటపట్టింది.
చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment