రోహిత్ శర్మ- నితీశ్ రాణా(PC: IPL)
‘‘గతేడాది నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో రోహిత్ భయ్యా దగ్గరకు వెళ్లి నా మనసులో చెలరేగుతున్న అలజడి గురించి పంచుకున్నాను. రెండు మ్యాచ్‌లు గెలిచాం.. రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం.
నాకేమీ అర్థం కావడం లేదు భయ్యా అన్నాను. అప్పుడు.. ‘నితీశ్.. ఇంతకీ కెప్టెన్సీ అంటే ఏమనుకుంటున్నావు? అని అడిగాడు.
వెంటనే నా మనసులో ఉన్నదంతా కక్కేయాలని.. ఏదో చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ.. రోహిత్ భయ్యా నన్ను మాట్లాడనివ్వలేదు.
‘కెప్టెన్సీ అంటే అసలేమీ లేదు. బౌలర్లను మారుస్తూ.. ఫీల్డర్లనూ అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం అంతే. ఫలితం నీకు అనుకూలంగా వచ్చిందనుకో.. నువ్వు బాగానే ఉంటావు.
ఒకవేళ నువ్వు ఆశించినది జరగలేదనుకో.. నువ్వు ఎంత మంచిగా కెప్టెన్సీ చేసినా ఎవరూ నీ గురించి మాట్లాడుకోరు. కాబట్టి నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటూ.. నీ ఆట, నైపుణ్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగాలంతే.
ఏ విషయాన్నైనా క్లిష్టంగా భావించనంత వరకు అంతా బాగానే ఉంటుంది. నువ్వు తెలివైన, తేలికైన మార్గాన్నే ఎంచుకోవాలి’ అని భయ్యా నాతో అన్నాడు.
ఆరోజు నన్ను నేను సమాధానపరచుకునేలా నాలో స్ఫూర్తి నింపాడు’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.
కాగా గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. బ్యాటర్‌గా ఫర్వాలేదనిపించినా కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు.
కేకేఆర్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 413 పరుగులు చేసిన నితీశ్ రాణా.. జట్టును ప్లే ఆఫ్స్ మాత్రం చేర్చలేకపోయాడు. ఈ క్రమంలో ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ తిరిగి రాగా.. కేకేఆర్ మేనేజ్‌మెంట్ అతడిని మళ్లీ కెప్టెన్‌గా నియమించింది.
అయితే, తాను కేకేఆర్ సారథిగా ఉన్న సమయంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో నాటి ముంబై ఇండియన్స్ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ విలువైన సూచనలు , సలహాలు ఇచ్చాడని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు. టీఆర్‌ఎస్ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా ఐపీఎల్-2024లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 42 పరుగులు చేయగలిగాడు. అయితే, కేకేఆర్ ఈసారి చాంపియన్‌గా నిలవడంతో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా మధుర జ్ఞాపకాలు సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment