![I Was Crying, We Didnt Have Indian Visa, Wasim Akram On Wife Demise In Chennai - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/28/Untitled-8.jpg.webp?itok=Z-9_Tts2)
పాకిస్తాన్ మాజీ పేసర్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ గతంలో జరిగిన ఓ విషాద సన్నివేశాన్ని తన ఆటోబయోగ్రఫీ "సుల్తాన్.. ఎ మెమోయిర్"లో ప్రస్తావించాడు. ఆ విషయాన్ని అక్రమ్ తాజాగా స్పోర్ట్స్ స్టార్ మ్యాగజిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
విషయం ఏంటంటే.. 2009లో అక్రమ్ తన భార్య హ్యుమా అక్రమ్‌తో కలిసి చెన్నై మీదుగా సింగపూర్‌కు ఫ్లైట్‌లో బయల్దేరాడు. మధ్యలో ఇంధనం నింపుకునేందుకు విమానం చెన్నైలో ల్యాండ్ కాగానే అప్పటికే గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అక్రమ్ భార్య హ్యుమా తీవ్ర అస్వస్థతకు గురై, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోని అక్రమ్ బోరున విలపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అక్రమ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో కొందరు గుర్తించారు. ఆ సమయంలో అక్రమ్‌కు కానీ అతని భార్యకు కానీ భారత వీసాలు లేవు. దీంతో అతని భార్య చికిత్స కోసం భారత్‌లో ప్రవేశించే అస్కారంలేదు. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఎయిర్‌పోర్ట్ అధికారులు అక్రమ్‌కు సహకరించి, అతని భార్యను చెన్నైలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అయితే అక్రమ్ భార్య అతర్వాత కొద్ది రోజులకే కన్నుమూసింది. ఇదే విషయాన్ని అక్రమ్ స్పోర్ట్స్ స్టార్ మ్యాగజిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. భారత అధికారులు గొప్ప మనసును కీర్తించాడు. తాను పాకిస్తానీని అయినప్పటికీ చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులు, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తన పరిస్థితి తెలిసి జాలిపడటమే కాకుండా కావాల్సిన సాయం చేశారని కొనియాడాడు.
ఆ సమయంలో ఏడుస్తున్న తనను ఓదార్చడమే కాకుండా, వీసా గురించి ఆందోళన చెందవద్దని, తాము అంతా చూసుకుంటామని తనలో ధైర్యం నింపారని తెలిపాడు. ఈ విషయాన్ని మనిషిగా తానెప్పటికీ మరిచిపోలేనని పాత విషయాలను నెమరేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment