షార్జా: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్-రాజస్తాన రాయల్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల మోత మోగింది. తొలుత కింగ్స్ పంజాబ్ 223 పరుగులు చేస్తే, తాము ఏమీ తక్కువ తినలేదని జవాబిస్తూ రాజస్తాన్ రాయల్స్ దాన్ని ఇంకా మూడు బంతులు ఉండగానే ఛేదించి భళా అనిపించింది. ఈ మ్యాచ్‌లో గేమ్ ఛేంజర్ తెవాటియానే. తొలుత స్మిత్, సంజూ శాంసన్‌లు ధాటిగా ఆడినా తెవాటియా ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్. భారీ లక్ష్య ఛేదనలో సెకండ్ డౌన్‌లో వచ్చాడు. అయితే పెద్దగా అంచనాలు లేని తెవాటియాను ఆ స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్న వచ్చింది. దానికి తగ్గట్టుగానే తెవాటియా తొలుత తడబడ్డాడు. తెవాటియా ఎదుర్కొన తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేసి ఇదేమి బ్యాటింగ్ అనిపించాడు. కానీ శాంసన్ ఔటైన తర్వాత మొత్తం గేమ్ స్వరూపాన్ని మార్చేశాడు తెవాటియా. కాట్రెల్ వేసిన 18 ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి గేమ్‌ను చేంజ్ చేసేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆడిన ఇన్నింగ్స్ కింగ్స్ పంజాబ్‌కు పరాజయాన్ని మిగిల్చింది. తెవాటియా మొత్తంగా 31 బంతుల్లో 7 సిక్స్‌లతో 53 పరుగులు చేసి మొత్తం గేమ్ స్వరూపాన్ని మార్చేసి తిట్టిన నోళ్లనే పొగిడేలా చేసుకున్నాడు. ఇలా తెవాటియా విమర్శించిన వారిలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప‍్రసాద్ కూడా ఉన్నారు. (చదవండి: కోహ్లిని ఊరిస్తున్న రికార్డు)
తెవాటియాను దింపి తప్పు చేశారు..
స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్‌లో కామెంట్రీ చెబుతున్న సమయంలో తెవాటియా బ్యాటింగ్ చూసి ఎంఎస్‌కే అసహనం వ్యక్తం చేశారు. తెవాటియాకు బ్యాటింగ్ రికార్డులు ఉండటం తాను ఎక్కడ చూడలేదని, మరి రాజస్తాన్ రాయల్స్ అతన్ని సెకెండ్ డౌన్‌లో దింపి తప్పు చేసిందన్నాడు. దీనివల్ల అవతలి ఎండ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఎంఎస్‌కే అన్నారు. ఆపై కాసేపటికి షమీ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్ ఆడే ప్రయత్నంలో సంజూ శాంసన్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో కింగ్స్ పంజాబ్ విజయం ఖాయమని ఆ ఫ్రాంచైజీ సంబరాలు చేసుకుంది. కానీ ఆ తర్వాతే కథ మొదలైంది. తెవాటియా తన బ్యాట్‌కు పని చెప్పి సిక్సర్లతో హోరెత్తించాడు. టీ20లో అసలైన మజాను అందించాడు. వరుస సిక్సర్లతో కాట్రెల్‌పై విరుచుకుపడ్డాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడంతో ఒక్కసారి మ్యాచ్ టర్న్ అయిపోయింది.
ఐయామ్ వెరీ సారీ..
మ్యాచ్ అనంతరం బైజూస్ క్రికెట్ లైవ్‌లో హోస్ట్ నందుతో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. తన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. ‘తెవాటియా గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లున్నాను. తెవాటియా ఒక అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్స్‌లతో విరుచుకుపడి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. తాను ముందుగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా. అతనిలో సామర్థ్యాన్ని గుర్తించే టీమ్ మేనేజ్‌మెంట్ ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment