అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌కు లిస్ట్-ఏ హోదా లభించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఐసీసీ నిర్ణయం వెలువడటంతో ఎంఎల్‌సీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (యూఏఈ) తర్వాత లిస్ట్-ఏ హోదా పొందిన రెండో అసోసియేట్ సభ్య దేశ లీగ్‌గా ఎంఎల్‌సీ గుర్తింపు దక్కించుకుంది.
ఎంఎల్‌సీ రెండో సీజన్ ఈ ఏడాది జులై 5 నుంచి ప్రారంభంకానుంది. ఎంఎల్‌సీలో ఈసారి గత సీజన్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత సీజన్‌లో ఆరు జట్లు సింగిల్ రౌండ్ రాబిన్ ఫార్మట్‌లో మూడు వారాల పాటు 19 మ్యాచ్‌లు ఆడగా.. ఈ సీజన్‌లో అన్నే జట్లు గత సీజన్ కంటే 6 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడనున్నాయి. ఎంఎల్‌సీని మరికొద్ది సీజన్లలో 10 జట్ల లీగ్‌గా ఎక్స్‌ప్యాండ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఎంఎల్‌సీలో బీసీసీఐ అనుబంధ ఆటగాళ్లు మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌కు తొలి సీజన్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ లీగ్‌ను లిస్ట్-ఏ హోదా లభించడానికి ఇదీ ఒక కారణం. ఎంఎల్‌సీ అరంగేట్ర ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టుకు కీరన్ పోలార్డ్ నేతృత్వం వహించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో పాటు లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సీయాటిల్ ఆర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఎంఎల్‌సీలో మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి.
క్రికెట్‌లో లిస్ట్-ఏను వన్డే ఫార్మాట్ కింద పరిగణిస్తారు. అంతర్జాతీయ వన్డేలతో పాటు పలు దేశవాలీ టోర్నీలు కూడా ఈ జాబితా పరిధిలోకి వస్తాయి. లిస్ట్-ఏ పోటీలు గరిష్టంగా 8 గంటల పాటు సాగుతాయి. ఐసీసీచే అధికారికంగా వన్డే హోదా పొందని దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లిస్ట్-ఏ కిందికే వస్తాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, టీ20 క్రికెట్‌తో పాటు లిస్ట్-ఏ క్రికెట్ ఐసీసీచే గుర్తించబడిన మూడు ప్రధాన ఫార్మాట్లలో ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment