ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ ప్రకటనను ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల (జూన్) 27న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఐసీసీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వరల్డ్‌కప్ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్ 5కు జూన్ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్ విడుదల చేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య ఆసియా కప్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. ఐసీసీ పంపిన ముసాయిదా షెడ్యూల్‌కు పీసీబీ ఇంత వరకు ఆమోదం తెలుపలేదు. షెడ్యూల్‌కు ఆమోదం తెలపాల్సింది తమ ప్రభుత్వమని పీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా దిగిపోయే ముందు నజమ్ సేథి ప్రకటన చేశాడు.
భద్రత కారణాల దృష్ట్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పీసీబీ స్పష్టం చేసింది. ఈ విషయంలోనే బీసీసీఐ-పీసీబీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు పీసీబీ కాబోయే ఛైర్మన్ జకా అష్రాఫ్ ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని, దీనికి తాను వ్యతిరేకమంటూ బాంబు పేల్చాడు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాక అయినా పీసీబీ దానికి అమోదం తెలుపుతుందా లేక ఏవైనా కారణాలు సాకుగా చూపించి అడ్డుపుల్ల వేస్తుందా అన్న విషయం తేలాంటే ఒకటి రెండ్రోజుల వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment