
ఆసిఫ్ కరీం విజృంభించడంతో ఒక్కసారిగా మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది.
న్యూఢిల్లీ: 8.2 ఓవర్లు, 6 మెయిడెన్, ఇచ్చిన పరుగులు 7 మాత్రమే, కీలకమైన మూడు వికెట్లు. ఈ గణాంకాలు సాదాసీదా మ్యాచ్‌లో కాదు. 2003 వన్డే ప్రపంచకప్‌లో. ప్రత్యర్థి భీకర ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా. బౌలర్ కూడా ఏ పాపులర్ టీమ్ సభ్యుడో అనుకోకండి. క్రికెట్‌లో పసికూనగా పేరున్న కెన్యాకు చెందిన ఆసిఫ్ కరీం. ఈ రోజు కరీం పుట్టిన రోజు కావడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాటి విశేషాలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా జట్టు బ్రెట్‌లీ, ఆండీ బిచెల్, డారెన్ లెహ్‌మాన్ దెబ్బతో 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. (చదవండి : 'విచారకరం.. నా ఇన్నింగ్స్ వారికే అంకితం')
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాథ్యూ హెడెన్ (14 బంతుల్లో 20; 5 ఫోర్లు) మెరుగైన ఆరంభం ఇచ్చారు. ఈ ఇద్దరినీ ఒంగొండో పెవిలియన్ చేర్చాడు. తర్వాత కెప్టెన్ రికీ పాంటింగ్, ఆండ్రూ సిమండ్స్‌తో కలిసి జట్టును విజయం దిశగా తీసుకెళ్తుండగా.. ఆసిఫ్ కరీం విజృంభించడంతో ఒక్కసారిగా మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. కీలకమైన పాంటింగ్ (18) వికెట్ తీసిన కరీం.. తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. తక్కువ పరుగుల వ్యవధిలోనే డారెన్ లేహ్‌మాన్ (2), బ్రాడ్ హాగ్ (0) వికెట్లు తీసి ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. చివర్లో ఇయాన్ హార్వే (43 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో కలిసి సిమండ్స్ (49 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) కెన్యా ఆశలపై నీళ్లు చల్లాడు. దాంతో మరో 112 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కరీం 34 వన్డేలు మాత్రమే ఆడి 27 వికెట్లు తీశాడు. 2003 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ అతనికి చివరిది కావడం గమనార్హం.
(చదవండి: టెస్ట్ చాంపియన్ షిప్ : నెంబర్ 1 ఆసీస్)