India women's team skipper Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది.
అందుకే ఈ చర్యలు
ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్ సిరీస్‌లో భాగంగా ఢాకాలో శనివారం బంగ్లాదేశ్‌తో మూడో మ్యాచ్ సందర్భంగా హర్మన్ వ్యవహరించిన తీరుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. హర్మన్... తాను అవుటైన తర్వాత వికెట్లను బ్యాట్‌తో కొట్టినందుకు గానూ ఇప్పటికే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు.. డిసిప్లినరి రికార్డులో 3 డిమెరిట్ పాయింట్లు ఇచ్చినట్లు పేర్కొంది.
రెండు మ్యాచ్‌లు ఆడకుండా
అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఐసీసీ నియమావళిలోని 2.8 నిబంధనను అతిక్రమించిందన్న ఐసీసీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బహిరంగంగా అంపైర్‌ను విమర్శించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె మ్యాచ్ ఫీజులో మరో 25 శాతం కోత(డిమెరిట్ పాయింట్ కూడా) విధించినట్లు వెల్లడించింది.
కాగా ఐసీసీ.. హర్మన్‌పై రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిషేధం విధించిన నేపథ్యంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఆమె ఒక టెస్టు మ్యాచ్ లేదంటే.. రెండు వన్డేలు లేదా రెండు టీ20లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
తప్పుడు నిర్ణయమని అంపైర్‌పై కోపంతో అలా..
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ బౌలింగ్‌లో భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది.
బంతి బ్యాట్‌కు తగలకుండా.. ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. ఎల్బీడబ్ల్యూ అయినట్లు పేర్కొన్నాడు. అయితే, బంతి లెగ్‌స్టంప్‌నకు ఆవల పిచ్ అయిందనుకున్న హర్మన్ తను అవుట్ కాకపోయినా తప్పుడు నిర్ణయంతో బలిచేశారని ఆగ్రహించింది. ఆ కోపంలోనే బ్యాట్‌తో వికెట్లను కొట్టింది.
అండగా నిలుస్తున్న అభిమానులు
అంతేకాదు మ్యాచ్ తర్వాత అంపైరింగ్ ప్రమాణాలను తప్పుబట్టిన ఆమె.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు కనీస మర్యాద చేయలేదంటూ బంగ్లాదేశ్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దీంతో టీమిండియా అభిమానులు.. ‘‘సూపర్ హర్మన్.. ఆటలో మనకు అన్యాయం జరిగిందని భావించినపుడు కోపం రావడం సహజం. అది మానవ నైజం.
ఇక మన హైకమీషన్ పట్ల వాళ్లు వ్యవహరించిన తీరుకు నువ్విచ్చిన కౌంటర్ అదుర్స్. మన పురుష క్రికెటర్లు కూడా ఇంత డేరింగ్‌గా మాట్లాడేవాళ్లు కాదేమో! నీపై ఐసీసీ చర్యలు తీసుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.
చదవండి: రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు! ఇలా అయితే: డీకే
Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb
— Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023
Comments
Please login to add a commentAdd a comment