పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో | Sakshi
Sakshi News home page

పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో

Published Wed, Mar 20 2024 11:07 AM

Idu RCBya Hosa Adhyaya Fans Goes Wild As Kohli Speaks Kannada Video Viral - Sakshi

Royal Challengers Bangalore Has A New Name Ahead Of IPL 2024: ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ పేరును Royal Challengers Bangalore నుంచి 'Royal Challengers Bengaluru'గా మార్చుకుంటున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది.

‘‘ఈ పట్టణ సంస్కృతి, వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు('Royal Challengers Bengaluru') ఇది మీ జట్టు.. మీ ఆర్సీబీ’’ అంటూ కొత్త లోగో, నూతన జెర్సీని రివీల్‌ చేసింది. 

ఇక ఈ కార్యక్రమానికి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి, ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, మహిళా జట్టు సారథి స్మృతి మంధాన సహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్సీబీకి తొలి టైటిల్‌ అందించిన వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024 చాంపియన్‌ స్మృతి మంధాన సేనకు పురుష జట్టు నుంచి గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ లభించింది.
  

ఇదిలా ఉంటే.. అన్‌బాక్స్‌ ఈవెంట్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లి కన్నడలో మాట్లాడటం హైలైట్‌గా నిలిచింది. ‘‘మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. ఆర్సీబీ చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం’’ అని కోహ్లి అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడినంత కాలం ఆర్సీబీతోనే ఉంటానని పేర్కొన్నాడు.

దీంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా పదహారేళ్లుగా ఆర్సీబీ పురుష జట్టు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. గతంలో రెండుసార్లు ఫైనల్‌ చేరినా.. టైటిల్‌ లాంఛనం పూర్తి చేయలేకపోయింది.

ఈ క్రమంలో ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌కు ముందు పేరు మార్పుతో బరిలోకి దిగనుండటంతో ఈసారైనా రాత మారుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. WPL టైటిల్‌ గెలవడం శుభసూచకమంటూ మహిళా జట్టును ప్రశంసిస్తూనే.. ఫాఫ్‌ బృందం కూడా ట్రోఫీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement