If Mumbai Indians Wins IPL 2023, History Will Be Created - Sakshi
Sakshi News home page

IPL 2023: ముంబై గెలిచిందా సరికొత్త చరిత్ర.. టైటిల్‌ నెగ్గే విషయంలో కాదు..!

Published Thu, May 25 2023 1:38 PM | Last Updated on Thu, May 25 2023 1:58 PM

If Mumbai Wins IPL 2023, History Will Be Created - Sakshi

PC: IPL 2023

ఆరంభంలో వరుస ఓటములు ఎదుర్కొని.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని.. ఆర్సీబీ ఓడటంతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుని.. నిన్న జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో మట్టికరిపించి క్వాలిఫయర్‌-2 (సెమీస్‌ అనుకోవచ్చు)కు చేరిన ముంబై ఇండియన్స్‌, ఐపీఎల్‌ 2023 టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించేలా ఉంది. చరిత్ర సృష్టించడం అంటే టైటిల్‌ నెగ్గే విషయంలో కాదు.

ఇప్పటివరకు 6 ఫైనళ్లు ఆడి 5 టైటిళ్లు గెలిచిన ముంబై ఆరోసారి టైటిల్‌ నెగ్గినా చరిత్రే అయినప్పటికీ.. ఈసారి టైటిల్‌ గెలిస్తే మాత్రం రోహిత్‌ సేన మరో విషయంలో రికార్డుల్లోకెక్కనుంది. అదేంటంటే.. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగో జట్టు టైటిల్‌ నెగ్గిన దాఖలాలు లేవు. ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టు మూడు సార్లు, రెండో జట్టు ఏడు సార్లు, మూడో జట్టు ఒక్క సారి (2016 సన్‌రైజర్స్‌) టైటిల్‌ సాధించాయి.

ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా మూడు సార్లు (2017, 2019, 2020) టైటిల్‌ నెగ్గిన ఘనత ముంబై ఇండియన్స్‌కే దక్కగా.. రెండో జట్టుగా  సీఎస్‌కే (2011, 2018, 2021) మూడు సార్లు, కేకేఆర్‌ (2012, 2014) రెండు సార్లు, ముంబై (2013, 2015) రెండు సార్లు టైటిల్‌ సాధించాయి. ఈ సీజన్‌లో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై ఒకవేళ టైటిల్‌ గెలిస్తే.. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, టైటిల్‌ నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించనుంది. 

కాగా, ముంబై ఇండియన్స్‌కు రేపు (మే 26) జరుగబోయే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో గుజరాత్‌ను, మే 28న జరిగే ఫైనల్లో సీఎస్‌కేను ఓడిస్తేనే ఈ ఘనత సాధ్యమవుతుంది. ముంబై చరిత్ర సృష్టించాలంటే ఇంకా రెండు అడ్డంకులు దాటాల్సి ఉంది. మరి ముంబై టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టింస్తుందో , లేక మధ్యలోనే ఓడి నిష్క్రమిస్తుందో వేచి చూడాలి. 

ఇదిలా ఉంటే, లక్నోతో నిన్న (మే 25) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆకాశ్‌ మధ్వాల్‌ (3.3-0-5-5) ధాటికి లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్‌ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది.

చదవండి: #MI: క్వాలిఫయర్‌-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement