దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే పలు మ్యాచ్‌ల ఫలితాలు సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు సూపర్ ఓవర్లకు వెళితే, ఆదివారం జరిగిన కింగ్స్ పంజాబ్- ముంబై ఇండియన్స్ అందుకు భిన్నం. ఈ మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్ వరకూ వెళితే కానీ ఫలితం తేలలేదు. తొలి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు ఐదు పరుగులే చేయడంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. అందులో కింగ్స్ పంజాబ్ విజేతగా నిలిచింది. తొలుత ముంబై ఇండియన్స్ 11 పరుగులు చేస్తే దాన్ని కింగ్స్ పంజాబ్ ఛేదించింది. క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్‌లు 12 పరుగులు సాధించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.
కాగా, ఐపీఎల్ చరిత్రలో రెండు సూపర్ల ద్వారా మ్యాచ్ ఫలితం తేలడం ఇదే తొలిసారి. గతేడాది వరల్డ్‌కప్ సమయంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. ఇక్కడ సూపర్ ఓవర్ వరకూ టై కావడంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇది అప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. ఈ నిబంధనపై యావత్ క్రికెట్ ప్రపంచం భగ్గుమంది. దాంతో సూపర్ ఓవర్లపై క్రికెట్ లామేకర్ మెరిల్‌బోన్ క్రికెట్ కమిటీ(ఎంసీసీ) కొన్ని సూచనలు చేయడంతో దానికి ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. అందులో సూపర్ ఓవర్ల నిబంధనను మార్చారు. సెమీస్,ఫైనల్(నాకౌట్ మ్యాచ్‌ల్లో) ఫలితం తేలేవరకు మళ్లీ మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహించాలనే రూల్ తీసుకొచ్చింది. ఇదే నిబంధనను ఐపీఎల్‌లో అమలు చేశారు.
రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..?
ఆదివారం నాటి మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. తొలుత పడిన సూపర్ ఓవర్ టైగా ముగియడంతో రెండో సూపర్ ఓవర్ తప్పలేదు. కానీ రెండో ది కూడా టై అయితే ఏంటనేది ప్రశ్న. ఇక రెండోది కూడా టై అయితే మూడో సూపర్ ఓవర్‌ను ఆడిస్తారా అనుమానం వ్యక్తమవుతోంది.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం భారతకాలమాన ప్రకారం మధ్యాహ్న మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌కు వెళితే రాత్రి గం.8గంటలకు ప్రారంభిచకూడదు. అదే సమయంలో రాత్రి మ్యాచ్‌లకు సూపర్ ఓవర్‌కు వెళితే అది అర్థరాత్రి 12గంటలు దాటకూడదని ఐపీఎల్ ప్రారంభానికి ముందు నిబంధన తీసుకొచ్చారు. అంటే ఇక్కడ సమయం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. తొలి సూపర్ ఓవర్ టై అయితే రెండో సూపర్ వెళ్లే క్రమంలో కూడా సమయాన్ని చూస్తారు. అలాగే రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే ఇరుజట్ల కెప్టెన్ల ఒప్పందం ప్రకారం చెరొక పాయింట్ కేటాయిస్తారు.
అంటే మూడో సూపర్ ఓవర్ ఉండదు. తలొక పాయింట్ తీసుకోవాల్సిందే. మొన్న జరిగిన రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్‌ల సమయాలను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్-కేకేఆర్ జట్ల మధ్య సూపర్ ఓవర్ రాత్రి గం7:39 ని.ల నుంచి 7:49 మధ్య జరిగింది. ఇక కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్‌ల మధ్య జరిగిన తొలి సూపర్ రాత్రి గం. 11:46ని.లకు ప్రారంభమైతే, రెండో సూపర్ ఓవర్ గం.11:55 ని.ల నుంచి గం.12:12ని.ల మధ్య జరిగింది. నిబంధన ప్రకారం రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ల మ్యాచ్‌లు నిర్ణీత సమయానికి కంటే ముందే ప్రారంభమయ్యాయి. ఇక్కడ రెండో మ్యాచ్‌లో పడ్డ రెండో సూపర్ ఓవర్ గం. 12.12ని.లకు ముగియడంతో మూడో సూపర్ ఓవర్‌కు అవకాశం లేదు. ఈ సమయంలో మళ్లీ సూపర్ ఓవర్ టై అయితే ఇరుజట్లు పాయింట్లతో సరిపెట్టుకోవాలి. ఒకవేళ వివాదాస్పద బౌండరీ కౌంట్ రూల్ అమలు చేసి ఉంటే ముంబై ఇండియన్స్ గెలిచేది. ముంబై ఇండియన్స్ 24 బౌండరీలు( సిక్స్‌లు, ఫోర్లు) కొడితే, కింగ్స్ పంజాబ్ 22 బౌండరీలే సాధించింది. ఇదిలా ఉంచితే, నాకౌట్ మ్యాచ్‌ల్లో అయితే టై అయితే ఫలితాన్ని సూపర్ ఓవర్ల ద్వారానే ఫలితాన్ని తేల్చాలి. ఇక్కడ తొలి సూపర్ ఓవర్, రెండో సూపర్ ఓవర్లు టైగా ముగిస్తే మూడో సూపర్ ఓవర్ అనేది ఉంటుంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఏదొక జట్టును విజేతగా తేల్చాలి కాబట్టి ఈ నిబంధనను ఫాలో కాకతప్పదు. ఇది గతేడాది ఐసీసీ తీసుకొచ్చిన నిబంధన.
Comments
Please login to add a commentAdd a comment