Ben Stokes Reply on England Bazball Tactics Against Rohit Sharma's Side: ‘బజ్‌బాల్’ ఇంగ్లండ్ తదుపరి గమ్యస్థానం భారత్. 177 రోజుల తర్వాత అది కూడా హైదరాబాద్‌లో టీమిండియాతో స్టోక్స్ బృందం తొలి టెస్టు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత పర్యటనకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆఖరి టెస్టులో అద్భుత విజయం సాధించింది. లండన్‌లో ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఉత్కంఠగా సాగిన మైదానంలో 49 పరుగుల తేడాతో ప్యాట్ కమిన్స్ బృందంపై గెలుపొందింది.
తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. అయితే, గత సిరీస్‌లో ఆస్ట్రేలియా గెలిచిన కారణంగా ట్రోఫీ మాత్రం కంగారూల వద్దనే ఉండనుంది. ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మక యాషెస్ తర్వాత టీమిండియాతో జనవరి నుంచి మరో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సిద్ధమవుతోంది.
ఇక న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా వచ్చిన తర్వాత స్టోక్స్ సారథ్యంలో బజ్‌బాల్ పేరిట దూకుడైన ఆటతో అలరిస్తోంది. మెకల్లమ్ మార్గదర్శనంలో స్టోక్స్ కెప్టెన్సీలో టెస్టుల్లో అగ్రెసివ్ క్రికెట్‌తో వరుస విజయాలు సాధించింది. అయితే, ఆసీస్‌తో మాత్రం ఇంగ్లండ్ అనుసరించి ఈ విధానం బెడిసికొట్టింది.
ఫలితంగా సిరీస్ గెలిచే అవకాశం చేజారింది. ఈ క్రమంలో ఐదో టెస్టులో విజయానంతరం మీడియాతో మాట్లాడిన బెన్ స్టోక్స్‌కు టీమిండియాతో సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. రోహిత్ సేనతో సిరీస్‌లోనూ బజ్‌బాల్ కంటిన్యూ చేస్తారా అని అడుగగా.. ‘‘మేము న్యూజిలాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశాం.
అయితే, సౌతాఫ్రికాపై అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాం. మళ్లీ పాకిస్తాన్‌ను ఓడించాం. కానీ ఆ తర్వాత.. ఆస్ట్రేలియాపై కూడా ఇలాంటి ఫీట్ అందుకోలేకపోయాం. ఏమో ఒకవేళ టీమిండియాతో సిరీస్‌లో ఇలాంటి విజయం అందుకుంటామేమో! కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది’’ అంటూ స్టోక్స్ బదులిచ్చాడు.
కాగా బజ్‌బాల్‌తో కివీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన ఇంగ్లండ్.. సౌతాఫ్రికాపై 2-1తో గెలిచింది. అనంతరం పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్.. టీమిండియాతో జనవరి 25- మార్చి 24 వరకు ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక స్టోక్స్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ‘‘ఓవరాక్షన్ వద్దు.. ఇక్కడికి వచ్చాక ద్రవ్‌బాల్ దెబ్బ రుచిచూద్దురు కానీ..’’ అంటూ టీమిండియా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment