West Indies vs India, 3rd T20I: వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే.. తర్వాత బాధపడాల్సి వస్తుందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సంజూ శాంసన్.. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుని జాగ్రత్తపడకపోతే జితేశ్ శర్మ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లు అతడి స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉందని హెచ్చరించాడు.
కాగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అదరగొడుతున్న కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియా తరఫున మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. సంజూకు అన్యాయం జరిగిందంటూ బీసీసీఐ సెలక్టర్లను ఏకిపారేసిన అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత సంజూ భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల నేపథ్యంలో సెలక్టర్లు అతడికి జట్టులో చోటిచ్చారు. ఈ క్రమంలో సంజూకు తొలి వన్డేలో ఆడే అవకాశం రాకపోగా.. తదుపరి మ్యాచ్‌లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు.
అయితే, ఆఖరి, నిర్ణయాత్మక వన్డేలో మిగతా బ్యాటర్లు కూడా చెలరేగిన పిచ్‌పై 51 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ.. పొట్టి ఫార్మాట్‌కు వచ్చే సరికి మళ్లీ పాత కథే పునరావృతమైంది. తొలి టీ20లో 12 పరుగులకే పెవిలియన్ చేరిన సంజూ శాంసన్.. రెండో మ్యాచ్‌లో 7 రన్స్ మాత్రమే చేయగలిగాడు.
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. సంజూను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘సంజూ శాంసన్.. నీకిచ్చిన అవకాశాలను అనవసరంగా వృథా చేసుకోకు. మళ్లీ విఫలమయ్యావంటే తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్‌తో మాత్రమే పోటీ అనుకోవద్దు.. ఇషాన్ ఎక్కువా.. సంజూ తక్కువా అని కాదు.
వీరిద్దరిని దాటి జితేశ్ శర్మ కూడా రేసులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా సంజూకు వార్నింగ్ ఇచ్చాడు. కాగా వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే తొలి రెండు టీ20లలో ఓటమిపాలైంది.
ఈ క్రమంలో గయానా వేదికగా సాగనున్న మూడో టీ20లో విజయం సాధిస్తేనే హార్దిక్ సేన సిరీస్‌ను కాపాడుకోగలిగే స్థితిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో సంజూపై వేటు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చదవండి: వెస్టిండీస్‌తో మూడో టీ20.. కిషన్‌పై వేటు! యువ సంచలనం ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment