ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్యా ప్లేయర్‌పై 6–0, 6–0తో విజయం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టిన ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ ఆ దిశగా మరో అడుగు వేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ అదరగొట్టింది.
రష్యా ప్లేయర్ అనస్తాసియా పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్) 6–0, 6–0తో ఘనవిజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.
13 విన్నర్స్ కొట్టిన ఆమె నెట్ వద్ద ఆరు పాయింట్లు గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–2తో ఎలిసబెట్టా కొకైరెట్టో (ఇటలీ)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
అల్‌కరాజ్ ముందంజ
పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్), తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అల్‌కరాజ్ 6–3, 6–3, 6–1తో అగుర్ అలియాసిమ్ (కెనడా)పై, సిట్సిపాస్ 3–6, 7–6 (7/4), 6–2, 6–2తో మాటియో అర్నాల్డి (ఇటలీ)పై గెలుపొందారు.
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్ మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. 4 గంటల 29 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ 7–5, 6–7 (6/8), 2–6, 6–3, 6–0తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ
పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 7–5, 4–6, 6–4తో ఒర్లాండో లుజ్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్) జంటను ఓడించింది.
రెండో రౌండ్‌లో బోపన్న–ఎబ్డెన్‌లతో ఆడాల్సిన సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)–థియాగో వైల్డ్ (బ్రెజిల్) టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో బోపన్న–ఎబ్డెన్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో)లతో బోపన్న–ఎబ్డెన్ ఆడతారు.
Comments
Please login to add a commentAdd a comment