మా వాళ్లకు ఇలాంటివి చేతకావు: పాక్‌ మాజీ క్రికెటర్‌ ఆగ్రహం | Illiterate People: Ex Pakistan Star Slams PCB As India Hammer Bangladesh 1st Test | Sakshi
Sakshi News home page

Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్‌ మొత్తం వాళ్లకే: పాక్‌ మాజీ క్రికెటర్‌

Published Mon, Sep 23 2024 5:04 PM | Last Updated on Mon, Sep 23 2024 7:58 PM

Illiterate People: Ex Pakistan Star Slams PCB As India Hammer Bangladesh 1st Test

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్‌ల తయారీ ఎలా ఉండాలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి నేర్చుకోవాలని హితవు పలికాడు. చెన్నై వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్టు అద్భుతంగా సాగిందని.. ఇందుకు పిచ్‌ క్యూరేటర్లే కారణమని కొనియాడాడు.

280 పరుగుల తేడాతో విజయం
కాగా పాకిస్తాన్‌ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌ ప్రస్తుతం భారత్‌ టూర్‌లో ఉంది. ఇందులో భాగంగా చెపాక్‌ వేదికగా సెప్టెంబరు 19న మొదలైన తొలి టెస్టు మూడున్నర రోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే, పేసర్లకు అనుకూలంగా ఉండే ఎర్రమట్టి పిచ్‌పై జరిగిన భారత్‌- బంగ్లా మ్యాచ్‌లో ఆరంభంలో ఫాస్ట్‌ బౌలర్లు సత్తా చాటగా.. పాతబడే కొద్ది స్పిన్నర్లు దుమ్ములేపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ మాట్లాడుతూ.. చెన్నై పిచ్‌ క్యూరేటర్ల పనితనాన్ని ప్రశంసించాడు.

ప్రతి బౌలర్‌ వికెట్లు తీశాడు
‘‘బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్‌ ఆరు వికెట్లు పడగొట్టాడు. జడేజా ఐదు వికెట్లు కూల్చాడు. సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా టీమిండియా 20 వికెట్లూ పడగొట్టింది. జట్టులోని ప్రతి బౌలర్‌ అన్ని రకాలుగా పరీక్షలో పాసయ్యారు.

మా వాళ్లకు ఇలాంటివి సాధ్యం కావు
పిచ్‌ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేసిన భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లనూ తుదిజట్టులోకి తీసుకుంది. అందుకు తగ్గట్లుగానే మ్యాచ్‌ సాగే కొద్దీ స్పిన్‌ బౌలర్లు ప్రభావం చూపారు. ఈ మ్యాచ్‌ ఇంత బాగా సాగడానికి కారణం పిచ్‌ క్యూరేటర్లు. క్రెడిట్‌ మొత్తం వాళ్లకే ఇవ్వాలి. టెస్టు మ్యాచ్‌ను ఎలా నిర్వహించాలో వారికి ఎంతబాగా తెలుసో మ్యాచ్‌ చూశాక అర్థమైంది.

మా వాళ్లకు మాత్రం ఇలాంటివి సాధ్యం కావు. మా దేశంలో పిచ్‌లకు ఎలాంటి విలువా లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి వాళ్లు నిరక్షరాస్యులేనని చెప్పవచ్చు’’ అని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌కు ఆడినందుకు గర్వపడే తనకు.. ఇప్పటి పిచ్‌ క్యూరేటర్లను చూసి కోపం వస్తోందంటూ బసిత్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

కాగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌లతో పాటు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలను ఆడించింది.

చదవండి: రోహిత్‌పై విమర్శలు.. ఎన్ని పరుగులు చేస్తారో చేయండి! పంత్‌ చెప్పిందిదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement