
దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్ (PC: Dubai Capitals Instagram)
International League T20: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు.
ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్ మార్వెల్ అంటూ వార్నర్ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. కాగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్-2023లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.
గతేడాది సీజన్‌లో మొత్తంగా 14 మ్యాచ్‌లలో కలిపి 516 పరుగులు సాధించిన వార్నర్.. ఆటగాడిగా సఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
రోవ్‌మన్ పావెల్ స్థానంలో వార్నర్
అయినప్పటికీ వార్నర్ నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచిన క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ ఈసారి ఐఎల్‌టీ20 లీగ్‌లో అతడిని తమ సారథిగా ఎంచుకుంది. ఇక దుబాయ్ క్యాపిటల్స్‌కు తొలి ఎడిషన్(2023)లో వెస్టిండీస్ స్టార్ రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పది మ్యాచ్‌లలో నాలుగు గెలిపించి ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు.
ప్రస్తుత సీజన్ కోసం 37 ఏళ్ల వార్నర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా జనవరి 13 నుంచి ఐఎల్‌టీ20 -2024 ఎడిషన్ ఆరంభం కానుంది. కాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను టైటిల్ విజేతగా నిలిపిన ఘనత కలిగిన వార్నర్‌కు టీ20లలో బ్యాటర్‌గానూ మంచి రికార్డు ఉంది.
అంతర్జాతీయ వన్డేలకూ రిటైర్మెంట్
పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తంగా 356 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్.. 11695 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలపడంలో అతడిది కీలక పాత్ర. ఇదిలా ఉంటే.. తన కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.
దుబాయ్ క్యాపిటల్స్ జట్టు:
డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఆండ్రూ టై, దసున్ షనక, దుష్మంత చమీర, జో రూట్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, నువాన్ తుషార, రహ్మనుల్లా గుర్బాజ్, రజా ఆకిఫ్, రోవ్‌మన్ పావెల్, రోలోఫ్ వాన్‌డెర్ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్, సికిందర్ రజా.
చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా?