సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ముందు ప్రిటోరియాలో జరిగిన మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్, ఇండియా-ఏ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో కదంతొక్కారు.
ఈ మ్యాచ్ రెండో రోజు గిల్ సెంచరీతో మెరవగా.. మూడో రోజు ఆటలో సర్ఫరాజ్ ఖాన్ మూడంకెల స్కోర్‌ను చేశాడు. గిల్ ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడన్న విషయం తెలియలేదు కానీ.. సర్ఫరాజ్ మాత్రం 61 బంతుల్లోనే మెరుపు శతకం బాదినట్లు సమాచారం. ఇదే మ్యాచ్‌లో మరో టీమిండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అర్ధసెంచరీ చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్మప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను కానీ, మీడియాను కానీ అనుమతించలేదు.
కాగా, సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి 30 వరకు తొలి టెస్ట్ సెంచూరియన్ వేదికగా జరుగనుండగా.. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ కేప్‌టౌన్‌లో జరుగుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడగా.. టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
పార్ల్ వేదికగా నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 78 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (108) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్‌లో మెరుపులు మెరిపించాడు.
అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్‌దీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), ఆవేశ్ ఖాన్ (2/45), అక్షర్ పటేల్ (1/48), ముకేశ్ కుమార్ (1/56) రాణించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment