IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్‌ సూర్యవంశీ.. భారత్‌ భారీ స్కోరు | Vaibhav Suryavanshi Shines With Half-Century As India U19 Dominates Australia In 2nd Youth ODI, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్‌ సూర్యవంశీ.. భారత్‌ భారీ స్కోరు

Sep 24 2025 1:30 PM | Updated on Sep 26 2025 9:07 AM

IND U19 vs AUS U19: Vaibhav Suryavanshi Vihaan Kundu 50s Ind Score 300

భారత్‌ అండర్‌-19 క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు (IND U19 vs AUS U19)తో రెండో యూత్‌ వన్డేలో ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు అద్భుత అర్ధ శతకం సాధించాడు. కాగా మూడు యూత్‌ వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆదివారం జరిగిన తొలి యూత్‌ వన్డేలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. 

 

ఆసీస్‌పై 1-0తో ఆధిక్యం
ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన వేదాంత్‌ త్రివేది (61 నాటౌట్‌), అభిగ్యాన్‌ కుందు (87 నాటౌట్‌) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఫలితంగా ఆసీస్‌పై 1-0తో ఆధిక్యం సాధించిన భారత్‌.. తాజాగా బుధవారం నాటి రెండో వన్డేలోనూ అదరగొట్టింది. బ్రిస్బేన్‌ వేదికగా రెండో యూత్‌ వన్డేలో టాస్‌ గెలిచిన ఆతిథ్య ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది.

ఆయుశ్‌ మాత్రే డకౌట్‌
ఓపెనర్‌, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విహాన్‌ మల్హోత్రాతో కలిసి ఇన్నింగ్స్‌ గాడిలో పెట్టాడు. వీరిద్దరు అద్భుత అర్ధ శతకాలతో రాణించారు.

వైభవ్‌, విహాన్‌ హాఫ్‌ సెంచరీలు
వైభవ్‌ మొత్తంగా 68 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించగా.. విహాన్‌ 74 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 70 పరుగులు రాబట్టాడు. మిగతా వారిలో వేదాంత్‌ త్రివేది 26 పరుగులు చేయగా.. వికెట​ కీపర్‌ బ్యాటర్‌ అభిగ్యాన్‌ కుందు మరోసారి హాఫ్‌ సెంచరీతో అలరించాడు.

అభిగ్యాన్‌ మరోసారి
అభిగ్యాన్‌ 64 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి 71 పరుగులు సాధించాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు రనౌట్‌ అయ్యాడు. ఏదేమైనా టాపార్డర్‌, మిడిలార్డర్‌ చెలరేగడంతో టీమిండియా 300 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లోయర్ ఆర్డర్‌ విఫలం కావడంతో 49.4 ఓవర్లలో ఆలౌట్‌ అయింది.

ఆస్ట్రేలియా అండర్‌-19 బౌలర్లలో విల్‌ బైరోమ్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. కెప్టెన్‌ యశ్‌ దేశ్‌ముఖ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో కాసే బార్టన్‌, హైడెన్‌ షీలర్‌, జాన్‌ జేమ్స్‌, ఆర్యన్‌ శర్మ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

భారత్‌ ఘన విజయం
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు.. 47.2 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఫలితంగా 51 పరుగుల తేడాతో గెలిచిన భారత యువ జట్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెండో యూత్‌ వన్డేలో భారత బౌలర్లలో కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే మూడు వికెట్లతో రాణించగా.. కనిష్క్‌ చౌహాన్‌ రెండు, కిషన్‌ కుమార్‌, ఆర్‌ఎస్‌ అంబరీశ్‌, ఖిలాన్‌ పటేల్‌, విహాన్‌ మల్హోత్రా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి: బీసీసీఐకి శ్రేయస్‌ అయ్యర్‌ లేఖ!.. ఇకపై నేను...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement