source: X
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ (221-7) చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (35 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఔటయ్యాక భారత్ స్కోర్ నెమ్మదించింది.
తిలక్ వర్మ (2), శివమ్ దూబే (12), ఇషాన్ కిషన్ (10), నితీశ్ కుమార్ రెడ్డి (1), శ్రేయస్ అయ్యర్ (29) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. అక్షర్ పటేల్ (5), రవి బిష్ణోయ్ (0) అజేయంగా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 2, రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు భారత బ్యాటర్లు రనౌటయ్యారు.
ఫాస్టెస్ట్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.
ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ


