ఇబ్రహీం జద్రాన్.. ఒకప్పుడు జట్టులో చోటే కరువు.. కానీ ఇప్పుడు.. అఫ్గనిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు.. కెప్టెన్‌గానూ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.
తద్వారా భారత్ వేదికగా పటిష్ట టీమిండియాతో తొలిసారిగా తలపడే టీ20 జట్టుకు సారథిగా వ్యవహరించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు. రోహిత్ సేనను చూసి భయపడే ప్రసక్తే లేదని.. ఇలాంటి బలమైన జట్టుతో పోటీపడటం కంటే మజానిచ్చే సవాల్ మరొకటి ఉండదంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాడీ 22 ఏళ్ల యువ బ్యాటర్.
టీమిండియాతో సిరీస్‌లో తాము కచ్చితంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తమ దేశ ప్రజలకు ప్రస్తుతం వినోదం అందించే ఏకైక అంశం క్రికెట్ మాత్రమే అని.. వారి ముఖాల్లో చిరునవ్వు నింపేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెబుతున్నాడు. ఇంతకీ సాదాసీదా ఇబ్రహీం జద్రాన్ బ్యాటింగ్ సెన్సేషన్‌గా ఎలా మారాడు?! జట్టులో తనకన్నా సీనియర్లు ఉన్నా తాత్కాలిక కెప్టెన్‌గా మేనేజ్‌మెంట్ అతడిపై నమ్మకం ఉంచడానికి కారణం ఏమిటి?!
భారత్‌లోనే అరంగేట్రం
భారత్ వేదికగా 2019లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అఫ్గనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు జద్రాన్. విండీస్‌తో ఆఖరి వన్డేలో ఆడే అవకాశం దక్కించుకున్న అతడు కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.
పూర్తిగా విఫలం
అయినప్పటికీ వెస్టిండీస్‌తో తదుపరి జరిగిన టీ20 సిరీస్‌లో జద్రాన్ ఆడించేందుకు సెలక్టర్లు నిర్ణయించారు. అయితే, ఈసారి కూడా అతడు పూర్తిగా నిరాశపరిచాడు. అరంగేట్ర టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 14 పరుగులు(2,11,1) మాత్రమే చేసి పూర్తిగా విఫలమయ్యాడు.
టెస్టులో సక్సెస్
అయినా.. డొమెస్టిక్ క్రికెట్ గణాంకాల దృష్ట్యా మేనేజ్‌మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది.. అదే ఏడాది టెస్టుల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది. ఈసారి తనపై సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. బంగ్లాదేశ్‌తో 2019లో జరిగిన మ్యాచ్‌లో జద్రాన్ 108 పరుగులతో సత్తా చాటాడు.
వన్డేల్లో సంచలనాలు సృష్టిస్తూ
ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌పై మరింత దృష్టి సారించిన ఇబ్రహీం జద్రాన్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో 2022లో జరిగిన సిరీస్ సందర్భంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 138 బంతుల్లోనే 162 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. జద్రాన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.
ప్రపంచకప్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగి
ఈ మ్యాచ్‌తో క్రికెట్ ప్రేమికుల దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ఇబ్రహీం జద్రాన్.. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇబ్రహీం జద్రాన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు.
ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో శతకం బాదిన ఈ యువ బ్యాటర్.. అఫ్గనిస్తాన్ తరఫున వరల్డ్‌కప్ ఈవెంట్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్‌లో అత్యంత పిన్న వయసులో(21 ఏళ్ల 330 రోజులు) శతకం బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు.
సచిన్, కోహ్లిలను వెనక్కినెట్టి
ఈ లిస్టులో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(22 ఏళ్ల 300 రోజులు), రన్‌మెషీన్ విరాట్ కోహ్లి(22 ఏళ్ల 106 రోజులు)లను అధిగమించి నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు అఫ్గన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్కు అందుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
అఫ్గన్ తరఫున ఏకైక సెంచరీ
ఇక.. నాడు ముంబైలో ఆసీస్‌తో నువ్వా- నేనా అన్న రీతిలో సాగిన మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్ 143 బంతులు ఎదుర్కొని 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో అఫ్గనిస్తాన్ తమ అత్యధిక స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రపంచప్-2023లో మొత్తంగా ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి 376 పరుగులు సాధించాడీ కుర్ర బ్యాటర్. అఫ్గన్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి ఆ జట్టు భవిష్యత్ ఆశాకిరణం అనే నమ్మకం కలిగించాడు.
కెప్టెన్‌గా తొలి విజయం
ఈ నేపథ్యంలో... ఈ మెగా టోర్నీ తర్వాత అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ ఆడేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లింది. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథ్యం వహించాల్సింది. కానీ అతడు వెన్నునొప్పి కారణంగా దూరం కావడంతో ఇబ్రహీం జద్రాన్‌ను అదృష్టం వరించింది.
రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ
కెప్టెన్‌గా యూఏఈతో సిరీస్‌లో బరిలోకి దిగిన అతడు 2-1తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో టీమిండియాతో సిరీస్‌కు అందుబాటులో ఉన్నపటికీ రషీద్ పూర్తిగా కోలుకోకపోవడంతో మరోసారి కెప్టెన్‌గా జద్రాన్ వైపు మొగ్గు చూపింది మేనేజ్‌మెంట్.
రోహిత్ సేనతో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్‌కు రషీద్ ఖాన్‌ను ప్లేయర్‌గా ఎంపిక చేసి సారథ్య బాధ్యతలను ఇబ్రహీం జద్రాన్‌కు అప్పగించింది. ఈ టూర్‌లో గనుక 22 ఏళ్ల ఇబ్రహీం బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సత్తా చాటితే అతడికి ఇక ఎదురు ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అంతర్జాతీయ కెరీర్‌లో ఇలా..
ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో సత్తా చాటిన అఫ్గనిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన ఇబ్రహీం జద్రాన్ ఇప్పటి వరకు 5 టెస్టులు, 28 వన్డేలు, 27 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 362, 1284, 616 పరుగులు సాధించాడు. పార్ట్‌టైమ్ రైటార్మ్ పేసర్ అయిన అతడి ఖాతాలో ఒక వికెట్ కూడా ఉందండోయ్!! అన్నట్లు ఇబ్రహీం జద్రాన్ అఫ్గనిస్తాన్‌లోని కోస్త్ ప్రాంతానికి చెందినవాడు.
చదవండి: Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment