భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా అండర్-19 టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ఈ ఫీట్ నమోదు చేసి ఔరా అనిపించాడు.
మొయిన్ అలీ తర్వాత
చెన్నై వేదికగా ఆస్ట్రేలియా యువ జట్టుతో జరుగతున్న అనధికారిక తొలి టెస్టు సందర్భంగా మంగళవారం ఈ ఘనత సాధించాడు. కాగా అండర్ 19 స్థాయిలో వైభవ్ కంటే ముందు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ మొయిన్ అలీ. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ 2005లో కేవలం 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకన్నాడు.
కాగా మూడు యూత్ వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు వచ్చింది. పుదుచ్చేరిలో జరిగిన వన్డే సిరీస్‌లో పర్యాటక జట్టును 3-0తో వైట్‌వాష్ చేసిన యువ భారత్.. చెన్నైలోని చెపాక్‌లో అనధికారిక తొలి టెస్టు మొదలుపెట్టింది.
వైభవ్ రనౌట్
ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటలోనూ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓపెనర్లు విహాన్ మల్హోత్రా 26 పరుగులతో ఆడుతుండగా.. వైభవ్ సూర్యవంశీ 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర
రెడ్‌బాల్ మ్యాచ్‌లో టీ20 తరహా ఇన్నింగ్స్ ఆడిన ఈ పదమూడేళ్ల కుర్రాడు.. దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక అంతకు ముందు.. ఇదే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. కేవలం 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించి.. బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
కాగా దేశవాళీ క్రికెట్‌లో వైభవ్ బిహార్ జట్టుకు ఆడుతున్నాడు. ఇక 12 ఏళ్ల వయసులోనే రంజీల్లో ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. వీరిద్దరు పదిహేనేళ్ల వయసులో రంజీ టోర్నీలో అడుగుపెట్టారు.
చదవండి: ‘జై షా తర్వాత బీసీసీఐ కార్యదర్శి ఎవరో గానీ.. ఈసారి అక్కడ మ్యాచ్‌లు వద్దు’
Comments
Please login to add a commentAdd a comment