Ind vs Aus 1st Test: Mohammed Shami Breaks Virat Kohli Sixes Record in Test - Sakshi
Sakshi News home page

BGT 2023: కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లను అధిగమించిన షమీ

Published Sat, Feb 11 2023 3:21 PM | Last Updated on Sat, Feb 11 2023 3:30 PM

IND VS AUS 1st Test: Mohammed Shami Breaks Virat Kohli Sixes Record In Test - Sakshi

Mohammed Shami: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించారు. ఫలితంగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (5/47, 70, 2/34) ఇరగదీయగా, రోహిత్‌ శర్మ (120) సెంచరీతో, అశ్విన్‌ (3/42, 5/37) 8 వికెట్లతో అక్షర్‌ పటేల్‌ (84) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో విజృంభించారు. భారత ఇన్నింగ్స్‌ చివర్లో మహ్మద్‌ షమీ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ స్పిన్నర్లపై విరుచుకుపడిన తీరు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.

ఈ ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదుర్కొన్న షమీ.. 3 భారీ సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ క్రమంలో షమీ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని ఓ విషయంలో అధిగమించాడు. అదేంటంటే.. కోహ్లి తన 104 మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్ట్‌ కెరీర్‌లో 24 సిక్సర్లు బాదగా.. షమీ కేవలం 60 టెస్ట్‌ల్లోనే పాతిక సిక్సర్లు బాది కోహ్లిని దాటేశాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (107) పేరిట ఉండగా.. భారత్‌ తరఫున ఈ రికార్డు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (91) పేరిట నమోదై ఉంది. ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో 66 టెస్ట్‌ సిక్సర్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. జడేజా, అశ్విన్‌లతో పాటు షమీ (1/18), సిరాజ్‌ (1/30) కూడా తలో చేయి వేయడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కు చాపచుట్టేసింది. అనంతరం రోహిత్‌ సూపర్‌ సెంచరీతో, అక్షర్‌, జడేజా బాధ్యతాయుతమైన హాఫ్‌సెంచరీలతో, ఆఖర్లో షమీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది.

ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మర్ఫీ 7 వికెట్లతో విజృంభించగా.. కమిన్స్‌ 2, లయోన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అశ్విన్‌, జడేజా, షమీ (2/13), అక్షర్‌ పటేల్‌ (1/6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆసీస్‌ కేవలం 91 పరుగులకే టపా కట్టేసి ఇన్నింగ్స్‌ ఓటమిని ఎదుర్కొంది. ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (25 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ ఫిబ్రవరి 17 నుంచి న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement