పొట్టి క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 26) జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా పాక్‌తో సమానంగా టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో పాక్ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలు సాధించగా.. నిన్నటి మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఈ రికార్డును సమం చేసింది.
పాక్ 226 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధిస్తే, భారత్ 211 మ్యాచ్‌ల్లోనే 135 విజయాల మార్కును అందుకుంది. పొట్టి క్రికెట్‌లో 100 విజయాల మార్కును భారత్, పాక్‌లతో పాటు న్యూజిలాండ్ జట్టు మాత్రమే అందుకోగలిగింది. కివీస్ జట్టు 200 టీ20ల్లో 102 విజయాలు నమోదు చేసింది. సౌతాఫ్రికా (171 మ్యాచ్‌ల్లో 95 విజయాలు), ఆస్ట్రేలియా (179 మ్యాచ్‌ల్లో 94 విజయాలు), ఇంగ్లండ్ (177 మ్యాచ్‌ల్లో 92 విజయాలు) జట్లు భారత్, పాక్, కివీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే, తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment