
టీమిండియా యంగ్ డైనమైట్ రింకూ సింగ్ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 31 పరుగులు (344.44 స్ట్రయిక్ రేట్) చేసిన రింకూ.. ఓ టీ20 ఇన్నింగ్స్‌లో 30 అంతకంటే ఎక్కువ పరుగులు (19 లేదా 20 ఓవర్లలో) చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో భారత్ తరఫున విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాడు. విరాట్, రింకూ సింగ్ ఇద్దరూ రెండ్రెండు సార్లు ఈ ఘనత సాధించడం విశేషం.
ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు పేట్రేగిపోయారు.
తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (80) మెరుపులు మెరిపించగా.. రెండో టీ20లో యశిస్వి (53), రుతురాజ్ (58), ఇషాన్ (52), రింకూ సింగ్ (31 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. గౌహతి వేదికగా ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో టీ20లో భారత బ్యాటర్లు ఇదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment