బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 104 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) కుప్పకూలింది.
46 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు.
534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ ఓటమి ఖరారైనా ట్రవిస్ హెడ్ (89), మిచెల్ మార్ష్ (47) కొద్దిసేపు పోరాడారు.
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి ఆసీస్ పరాజయానికి బాటలు వేసిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
స్వదేశానికి గంభీర్
తొలి టెస్ట్‌లో ఘన విజయం అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత గంభీర్ భారత్‌కు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అతను బీసీసీఐ వద్ద అనుమతులు కూడా తీసుకున్నట్లు సమాచారం. గంభీర్.. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ సమయానికి తిరిగి జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరుగనుంది.
ఈ మధ్యలో భారత్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడు. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ కావడంతో ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్‌ను కూడా పింక్ బాల్‌తోనే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో హిట్‌మ్యాన్ తొలి టెస్ట్‌కు దూరమైన విషయం తెలిసిందే.
టీమిండియాకు విందు
భారత క్రికెట్ జట్టు బుధవారం రోజున కాన్‌బెర్రాకు బయల్దేరనుంది. ఆ రోజు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ టీమిండియాకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వచ్చినందుకు గానూ భారత ఆటగాళ్లకు ఇది వెల్‌కమ్ పార్టీ.
Comments
Please login to add a commentAdd a comment