
ఈనెల 27న రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న నామమాత్రపు చివరి వన్డేకు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడి, ఆసీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక ఆసీస్‌తో జరిగే మూడో వన్డేకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ ప్రకటించింది.
ప్రస్తుతం ఎన్‌సీఏలోని రిహాబ్‌లో ఉన్న అక్షర్ గాయం నుంచి కోలుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత సెలక్టర్లు ఆసీస్‌తో మూడో వన్డేకు అక్షర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్షర్ వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అక్షర్ వరల్డ్‌కప్ సన్నాహక మ్యాచ్‌ల సమయానికంతా కోలుకుంటాడని చెబుతున్నాయి.
మరోవైపు వరల్డ్‌కప్‌లో అక్షర్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్‌తో సిరీస్‌లో జోరును ప్రదర్శిస్తూ సెలెక్టర్లకు సవాలు విసిరాడు. యాష్ ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో వరల్డ్‌కప్‌లో స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వరల్డ్‌కప్ సమయానికి అక్షర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే.. అక్షర్, అశ్విన్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి.
వీరిద్దరిలోనే ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కాక సెలెక్టర్లు సతమతమవుతుంటే, వాషింగ్టన్ సుందర్ నేను కూడా లైన్‌లో ఉన్నానంటూ సవాలు విసురుతున్నాడు. మరి ఉన్న ఒక్క స్పిన్ ఆల్‌రౌండర్ పోజిషన్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కాగా, వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల బృంధాన్ని అన్ని జట్లు సెప్టెంబర్ 28వ తేదీలోపు ప్రకటించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. నిన్న జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment